Are you doing workouts?.. Be careful
mictv telugu

వర్కౌట్లు చేస్తున్నారా?.. భద్రం బీ కేర్ ఫుల్

November 15, 2022

ఒబేసిటీ ఇప్పుడు అన్నింటికన్నా అతి పెద్ద సమస్యగా తయారయింది. దీనికి కారణాలు అనేకం. కొంతమందికి కొన్ని శారీరక సమస్యల వల్ల వస్తుంటే మరికొంత మందికి మితిమీరిన ఆహారం, బద్ధకం వల్ల వస్తోంది. లావు తగ్గుతున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే దాని మీద ఎవేర్ సెస్ బాగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే అదొక ఫ్యాషన్ కింద తయారయిపోయింది. దానికి తగ్గట్టే బోలెడు రకాల ఫిట్ నెస్ మంత్రాలు కూడా వచ్చేస్తున్నాయి. కల్ట్ ఫిట్ నెస్, యోగా, వర్కౌట్స్, జిమ్ ఇంకోటి, ఇంకోటి… లావు తగ్గడానికి వీటిని ఉపయోగిస్తే పర్వాలేదు కానీ దాన్ని ఫ్యాషన్ గా, పేషన్ గా కూడా తీసుకుంటేనే ప్రమాదం. ఇప్పడు అదే జరుగుతోంది. మితిమీరిన వర్కౌట్లు చేయడం, తమ బాడీకి ఏది సరిపోతుందో తెలుసుకోకుండా ట్రైనింగ్ లు ఫాలో అయిపోవడం…ప్రాణాల మీదకు తెస్తోంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోవడం లేదు.

యంగ్ ఏజ్ లోనే చనిపోయిన సెలబ్రిటీలు, హీరోలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోతున్నారు. వీరందరి చావుకు కారణం అతి వ్యాయామం. సినిమాల కోసం తగ్గాలనో, లైమ్ లైట్ లో ఉండాలనో వీరు చేస్తున్న వర్కౌట్లు వారి ప్రాణాలనే తీస్తున్నాయి. మామూలు జనం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. వాళ్లు సెలబ్రిటీలు కాబట్టి అందరికీ తెలుస్తోంది. సాధారణ మనుషులు చనిపోతుంటే తెలియడం లేదు అంతే తేడా. లావు ఉన్నా లేకపోయినా వ్యాయామం చేయడం ఎప్పుడూ మంచిదే. అలాగే డైట్ ఫాలో అవ్వడం కూడా చాలా మంచింది. కానీ ఏం చేసినా ఒక పరిమితిగా చేయాలి. ఒక పద్ధతి ప్రకారం చేయాలి. సరైన గైడెన్స్ తో చేయాలి. ఎలా పడితే అలా చేస్తే ఇదిగో ఇలానే ప్రాణాలు పోతాయి. లైఫ్ టైమ్, తిండి, వ్యాయామం వీటి మీద చాలానే అధ్యయనాలు జరిగాయి.

వర్కౌట్స్ వాల్యూమ్స్, లైఫ్‌టైమ్‌పై వాటి ప్రభావం మధ్య లింక్‌ని కనుగొనడానికి బోలెడు పరిశోధనలు జరిగాయి. మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన వారపు వర్కౌట్, మరణాల ఫలితాల మధ్య సంబంధాలను పరిశీలించింది. దాదాపు 9వేల మంది పెద్దల నుండి ఎక్కువ కాలం డేటాను ఉపయోగించి, కార్డియో వర్కౌట్, బాల్ స్పోర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్ మొదలైన వారందరి క్రీడా శిక్షణ, వరౌట్లు పై అధ్యయనం చేశారు. వారానికి 4,5 గంటల కంటే ఎక్కువ కష్టపడే వారికి ప్రయోజనం కంటే నష్టాలే ఉంటాయని ఈ పరిశోధనల్లో తేలింది. వ్యామామం చేయని వారితో పోలిస్తే వారి మరణాల ప్రమాదాలు ఇప్పటికీ తక్కువగా ఉన్నప్పటికీ, శారీరాన్ని ఎక్కువ శ్రమ పెడుతున్న వారి మరణాల సంఖ్యా ఏమి తక్కువగా లేదు.

అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ బేసిక్ టు ట్రాన్స్‌లేషనల్ సైన్స్‌లో ఈ సంవత్సరం ప్రచురించిన ఎలుకలపై పరిశోధనలో ఎక్కువ వర్కౌట్ చేస్తే గుండె దెబ్బతింటుందని పేర్కొంది. ఎలుకలలో తీవ్రమైన వర్కౌట్, ఇది రోజుకి 60 నిమిషాలు, వారానికి ఐదు రోజులు, మనుషులకి 10 నుండి 12 సంవత్సరాల పాటు పరిగెత్తడానికి సమానం. ఇది ధమనులు గట్టిపడటం, అనేక రూపాలతో ముడిపడి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ స్థాయి తీవ్రమైన వర్కౌట్ గుండె సంకోచం, సడలింపుని నియంత్రించే ఎంజైమ్‌లలో అసమతుల్యతకు దారితీసి ప్రాణాలు పోతున్నాయని కనుగొన్నారు.

ఆల్రెడీ రన్నర్, కావాలనుకునేవారిపై జరిపిన పరిశోధనలో… 60 నిమిషాల నుండి 2.4 గంటల మధ్య పరిగెత్తే వారు తక్కువగా మరణిస్తున్నారని తేల్చారు. అయితే, ఎక్కువగా నడిచేవారిలో మాత్రం ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది.అదే పరిశోధనా బృందం రన్నర్లలో ఇదే విధమైన U ఆకారపు ప్రమాద వక్రతను కనుగొంది. వారానికి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గంటలు…గంటకు కనీసం 7 మైళ్ళ వేగంతో పరిగెత్తే అత్యంత శ్రమతో కూడుకున్న రన్నర్‌లు, అస్సలు పరుగెత్తని నిశ్చల పెద్దలతో సమానంగా మరణాల రేటును కలిగి ఉన్నారని తేల్చారు. ప్రతీ ఏడాదికీ ఈ పరిశోదనల్లో తేడాలు కనిపిస్తున్నాయి. మొదటిది 2012లో జరిగితే రెండవ పరిశోదన 2015లో జరిగింది. ఎక్కువ శ్రమతో కూడిన వర్కౌట్ గుండె, పెద్ద ధమనుల రోగ లక్షణ నిర్మాణ పునర్నిర్మాణాన్ని ప్రేరేపిస్తుందని అధ్యయన బృందం రాసింది.

చాలా మంది ప్రజలు యవ్వనంలో తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. భారీ కార్డియో వర్కౌట్ ఇది మంచి సమయమే.అయితే, 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు తర్వాత గుండె పనితీరు కాస్తా తగ్గుతుంది. కార్డియాక్ ప్రాబ్లమ్స్‌‌కి అవకాశం ఉంటుందట. ఈ వయసు వాళ్లు పుడ్ ఇన్ టేక్ ఎంత తీసుకున్నా దానిలో అన్ని రకాల క్యాలరీలు, ప్రొటీన్లు, విటమిన్లు కవర్ అయ్యేలా తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సరిగ్గా తినకుండా వ్యాయామాలు చేస్తే లైఫ్ కి గ్యారంటీ లేదని అంటున్నారు.

ఎక్కువ వ్యాయామం చేస్తే ఫిట్‌నెస్ కెపాసిటీ క్షీణిస్తుందిట. దేనికోసమైతే చేస్తున్నామో దాన్నే మనం వదులుకుంటున్నట్టన్నమాట. అతి సర్వత్ర వర్జయేత్. ఇది దేనిలో అయినా వర్తిస్తుంది. ఏది ఎక్కువ చేసినా ప్రమాదమే కాబట్టి అస్సలు వ్యాయామం చేయకుండా ఉండడం మంచిది కాదు అలాని పడిపడి చేయడం కూడా మంచిది కాదు. మన శరీరం ఎంతవరకు భరిస్తుందని అనే దాన్ని ముందు తెలుసుకోగలగాలి. అలాగే తిండి విషయంలో కూడా. మనం ఎంత తింటే మనకు మంచిదని మనకు మనమే తెలుసుకోవాలి. వ్యాయామం గురించి కానీ, తిండి గురించి కానీ ఏ ఫిటన్ నెస్ గురూలు, డాక్టర్లు, డైటీషియన్లు చెప్పలేరు. వాళ్ళు కేవలం కొంతవరకు మాత్రమే సలహాలు ివ్వగలరు. మిగతాది మనకు మనమే తెలుసుకోవాలి. దేన్నీ, ఎవరినీ గుడ్డిగా ఫాలో అయిపోకూడదు.