మనశరీరానికి నీరు చాలా ముఖ్యం. ఈ విషయం అందరికీ తెలిసిందే. శరీరానికి తగినంత నీరు అందిస్తే…ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది. శరీరంలో నీరు తగ్గితే వృద్ధాప్యం నుంచి చర్మ సమస్యల వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. బాడీ డీహైడ్రేషన్ బారిన పడినట్లయితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. డీహైడ్రేషన్ వేగంగా వృద్ధాప్యంతోపాటు జీవితాన్ని త్వరగా ముగించేస్తుందని ఓ కొత్త సర్వే సూచిస్తోంది. అంతేకాదు డీహైడ్రేటెట్ గా ఉన్న వారికంటే లేనివారే మరింత ఎక్కువ కాలం జీవిస్తారట. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గుండె,ఊపిరితిత్తుల వ్యాధి వంటి తక్కువ ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటారని అధ్యాయనం పేర్కొంది.
మలబద్దకంతో ఇబ్బంది:
శరీరంలో నీటిశాతం తగ్గినట్లయితే..పొట్టకు సంబంధిత వ్యాధులు వస్తాయి. తక్కువ నీరు తాగడం వల్ల మలబద్దకం సమస్యను ఎదుర్కొవల్సి వస్తుంది. నిజానికి ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే శరీరానికి తగినంత నీరు అసవరం. శరీరంలో నీటి పరిమాణం తగ్గితే డిహైడ్రేట్ కు గురవుతుంది. దానివల్ల మలబద్దకం సమస్య తలెత్తుతుంది.
జీర్ణక్రియను సులభతరం చేయడానికి:
నీరు జీర్ణక్రియను సులభతరం చేయడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచి, కొవ్వును కరిగిస్తుంది. నిర్జలీకరణాన్ని నివారించడానికి నీరు చాలా అవసరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..పెద్దవాళ్లు రోజుకు కనీసం 2లీటర్ల నీటిని తాగాలి. తగినంత నీరు అందించకపోవడంతో ఎన్నో రకాల ఆరోగ్యసమస్యలు వస్తాయి. చర్మాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధులకు కారణం:
కొత్త అధ్యయనం ప్రకారం…శరీరంలో ద్రవాల స్థాయిలు పడిపోయినప్పుడు..సీరం సోడియం స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీంతో దీర్ఘకాలిక వ్యాధులకు, అకాల మరణానికి దారితీస్తుంది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన పరిశోధన ఆధారంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం..అధిక సీరం సోడియం స్థాయిలు ఉన్నవారికి ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ సోడియం స్థాయి ఉన్నవారితో పోల్చితే..కణాల వృద్ధాప్యంతోపాటుగా ఆకస్మాత్తుగా మరణించే ప్రమాదం ఉంది.
30ఏళ్లు ఉన్న 11వేల మంది ఆరోగ్యడేటాను పరిశోధన కోసం ఉపయోగించారు. సీరం సోడియం స్థాయిలు 142కంటే ఎక్కువగా ఉన్నవారికి గుండెపోటు, స్ట్రోక్, రక్తనాళాల వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధి, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అయితే రోజుకు ఎంతమొత్తంలో నీరు తాగాలన్నదానిపై ఎలాంటి సిఫార్సులు లేవు. అయినప్పటికీ సాధారణంగా రోజుకు కనీసం 6నుంచి 8 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.