Are you using PhonePay or GooglePay?
mictv telugu

ఫోన్‌పే, గూగుల్‌పే వాడుతున్నారా..అయితే, ఛార్జీ కట్టాల్సిందే

August 18, 2022

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో మారుమూల గ్రామాల నుంచి పెద్ద పెద్ద మహానగరాల వరకు ప్రజలు అప్డేట్‌లో ఉంటున్నారు. ఏదైనా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన వెంటనే దాని వల్ల లాభం ఎంత?, నష్టం ఎంత? అని ఆరా తీస్తున్నారు. ఆ విధంగా అందుబాటులోకి వచ్చినవే.. గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ యాప్స్. ఈ యాప్స్ ద్వారా ప్రజలు దాదాపుగా డబ్బు వినియోగాన్ని తగ్గించి, రూ.10 చెల్లించాలన్నా, యూపీఐ ద్వారానే డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ యాప్స్‌ను వాడుతున్నా వారికి ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది.

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెడీ అయ్యింది. యూపీఐ ట్రాన్సాక్షన్లపై కూడా ఛార్జీలను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ అంశాలపై తమ అభిప్రాయాన్ని రిజర్వు బ్యాంక్ ఇండియా తన డిస్కషన్ పేపర్‌లో వెల్లడించింది.

”రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లింపు వ్యవస్థల్లో భారీగా పెట్టుబడి పెట్టింది. అయితే, వాటి నిర్వహణ వ్యయాన్ని తిరిగి పొందే అవకాశాలను ప్రస్తుతం పరిశీలిస్తోంది. డెబిట్ కార్డ్ లావాదేవీల కోసం ఇంటర్‌చేంజ్, తప్పనిసరి ప్రతి లావాదేవీ రుసుము విధించాలని యోచిస్తోంది. ఇదే సమయంలో యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది” అని డిస్కషన్ పేపర్‌లో తెలిపింది.

ఇక, యూపీఐ (Unified Payment Interface-UPI) గురించి తెలియని వారుండరు. ఏదైనా చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ప్రస్తుతం విరివిగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్‌లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయవచ్చు. UPI ద్వారా డబ్బును 24X7 బదిలీ చేసుకునే సదుపాయముంది. ఈ క్రమంలో ఆర్‌బీఐ.. యూపీఐ లావాదేవీలపై తీసుకున్న ఛార్జీల నిర్ణయంపై త్వరలోనే పూర్తి సమాచారం వెల్లడించనుంది. ఎంత ఛార్జీ చెల్లించాలి? ఎలా చెల్లించాలి? అనే పూర్తి విషయాలను త్వరలోనే వినియోగదారులకు తెలియజేయనుంది.