చర్చించకుండానే అంగీకరించం అంటే ఎట్లా? సమ్మెపై ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు - MicTv.in - Telugu News
mictv telugu

చర్చించకుండానే అంగీకరించం అంటే ఎట్లా? సమ్మెపై ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు

October 28, 2019

తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు తమ వాదనలను గట్టిగా వినిపించాయి. మీ వాదనలు ఎలా ఉన్నe మధ్యలో సామాన్యులు నలిగిపోతున్నారంటూ హైకోర్టు రెండు పక్షాలను మందలించింది. ఆర్టీసీని రాత్రికి రాత్రి ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదంటూనే ప్రభుత్వ తీరును అంశాలవారీగా తప్పుబట్టింది. ఆర్థిక భారం లేని డిమాండ్లపై చర్చలు సాగితే  కార్మికుల్లో ఆత్మస్థయిర్యం కలుగుతుందని పేర్కొంది. బస్సులు తిరగక ఎవరైనా చనిపోతే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించింది. 

ముందు చర్చించండి.. 

‘కార్మికుల డిమాండ్లను అంగీకరించబోమని ప్రభుత్వం ముందే నిర్ణయించడం సరికాదు. ముందస్తు నిర్ణయం తీసుకుంటే ఇక చర్చలెందుకు? ఆర్టీసీ కార్మికుల కంటే ప్రజల ఇబ్బందులను పట్టించుకోవాలి. తెలంగాణలో రైళ్లలోకంటే బస్సుల్లోనే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. అదిలాబాద్ అడవుల్లోని చిన్నారులకు జబ్బు చేరస్తే వరంగల్, హైదరాబాద్‌లకు రావాలి. బస్సులు తిరగక ఆ చిన్నారి చనిపోతే  ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా?’ అని తీవ్రంగా ప్రశ్నించింది. రాష్ట్రంలో అసలే డెంగ్యూ జ్వరాలతో చనిపోతున్నారని మండిపడింది. ‘21 డిమాండ్లలో నాలుగింటి పరిష్కారానికి రూ. 46.2కోట్లు అవసరమని అంటున్నారు. ప్రభుత్వం ఆ డబ్బుఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా’ అని కోర్టు అదనపు ఏజీ రామచంద్రరావును ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ డబ్బు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. దీనిపై మండిపడిన కోర్టు ఏజీ బీఎస్ ప్రసాద్‌ను పిలిపించింది. డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని, కార్మికుల తీరు బాగా లేదని ఆయన అన్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..‘ప్రభుత్వం అన్ని ఖర్చులు పెడుతోంది. రూ.47 కోట్లు ఇవ్వలేదా?’ అని మందలించగా, సమాధానం రేపు చెబుతామని ఏజీ అన్నారు.  దీనికి కోర్టు స్పందిస్తూ ‘మీకు ఇబ్బంది ఉంటే, సీఎస్‌, ఆర్థికశాఖ కార్యదర్శిని పిలుస్తాం’ అని పేర్కొంది. 

telangana high court.

విలీనం డిమాండే అడ్డంకి.. 

రాత్రికి రాత్రే సమస్యలు పరిష్కారం కావని కోర్టు పేర్కొంది. విలీనం డిమాండే పెద్ద ఆటంకంగా ఉందని,  మిగతా డిమాండ్లపై చిన్నచిన్న విభేదాలే ఉన్నాయి కనుక ముందుగా వాటిపై చర్చించాలని సూచించింది. ‘ఆర్ధికభారం పేరుతో ప్రభుత్వం వాయిదా వేస్తోంది..మీరు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకనే ఆర్టీసీ ఇంత నష్టాల్లో ఉంది. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదికను మాకు ఎందుకివ్వలేదు..’ అని ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. ‘ నివేదికలను మా వద్ద కూడా దాచి పెడతారా?’ అని మండిపడిన కోర్టు ఆర్టీసికి పూర్తిస్థాయి ఎండీని ఎందుకు నియమించలేదని మరోమారు ప్రశ్నించింది. పూర్తిస్థాయి ఎండీ ఎండీ ఉంటే కార్మికులు వారి సమస్యలు చెప్పుకునే వారని పేర్కొంది.

కార్మిక సంఘాలు ఏమన్నాయి? 

ఆర్టీసీ నష్టాలకు తమ జీతభత్యాలు కారణం కాదని కార్మికులు వాదించారు. ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉందని గణాంకాలు వెల్లడించారు. ‘బస్సు పాసుల వల్ల రోజుకు రూ.2.3కోట్ల నష్టం వస్తోంది. జీహెచ్‌ఎంసీ నుంచి రూ.1400కోట్లు రావాల్సి ఉంది. రీయింబర్స్‌మెంట్‌, జీహెచ్‌ఎంసీ బకాయిలు కలిపి రూ.4,967 కోట్లు ఉన్నాయి. వీటి విషయంలో యాజమాన్యం స్పందించడం లేదు’ అని వివరించారు. 21 డిమాండ్లపైనే చర్చకు ఆర్టీసీ యాజమాన్యం పట్టుబట్టిందని మిగతా వాటిని పట్టించుకోవడం లేదని వారి న్యాయవాది దేశాయ్ రెడ్డి ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.