కరోనాకు ముసలోళ్ల సొంత వైద్యం.. వికటించి భర్త మృతి..   - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాకు ముసలోళ్ల సొంత వైద్యం.. వికటించి భర్త మృతి..  

March 24, 2020

nbvn

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బలి అవుతున్నారు. ఆ మహమ్మారిని అంతమొందించడానికి ఇంకా శాస్త్రవేత్తలు మందులు కనిపెట్టలేదు. ఆ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కరోనాకు మందులు అని ప్రచారాలు జరుగుతున్నాయి. అరిజోనాలోని మేరీకోపా కౌంటీకి చెందిన 60 ఏళ్ళ వయసు పైబడిన దంపతులు ఇటీవల కరోనా వైరస్ గురించి విన్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మహమ్మారిని నిరోధించడంలో క్లోరోక్విన్‌ గొప్పగా ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పడం గమనించారు. అందుకోసం ఇంటర్‌నెట్‌లో సెర్చింగ్ చేసి క్లోరోక్విన్ గురించి చదివారు. వారికి కరోనా నిర్ధారణ కాకపోయినప్పటికీ సొంతవైద్యానికి పాల్పడ్డారు. యాంటీ మలేరియా డ్రగ్‌లో ఉపయోగించే మందును వారిద్దరు తీసుకున్నారు. వెంటనే ఇద్దరికీ వాంతులు, తల తిప్పడం సంభవించాయి. దీంతో భర్తకు గుండె పోటు వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. భార్య బతికి బట్టకట్టింది. 

ఈ విషయమై బేనర్ పాయిజన్ అండ్ డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ డేనియల్ బ్రూక్స్ మాట్లాడుతూ.. ‘వారిద్దరు సొంత వైద్యం చేసుకున్నారు. ఇది అందరికీ ఓ హెచ్చరిక. ఈ విధంగా సొంత వైద్యం చేసుకోవడం చాలా ప్రమాదకరం పైగా మూర్ఖత్వం కూడా. ఇదేమీ గారడీ చేసే మాత్ర కాదు. ఈ దంపతులు ఇంటర్నెట్‌లో క్లోరోక్విన్ ఫాస్పేట్ గురించి చదివారు. కోవిడ్-19కు చికిత్సకు సంబంధించి ఇంటర్నెట్‌లో తప్పుడు సమాచారం చాలా ఉందని చెప్పారు. సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్పే మాటలను, ఇచ్చే సలహాలను మాత్రమే ప్రజలు పాటించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆరోగ్య శాఖ అధికారులు అందజేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి’ అని హెచ్చిరించారు ఆయన. కాగా, చాలా కాలం నుంచి మలేరియా నివారణకు వాడుతున్న రెండు మందులు – క్లోరోక్విన్, హైడ్రోక్సిక్లోరోక్విన్ – కరోనా వైరస్‌కు సమగ్ర చికిత్స కాగలవని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ మందులను పరీక్షిస్తున్నారని తెలిపారు.