'అర్జున్ రెడ్డి'..ఉన్నది ఉన్నట్టుగా..! - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’..ఉన్నది ఉన్నట్టుగా..!

August 30, 2017

ఇటీవలి తెలుగు సినిమా చరిత్రలో  ‘అర్జున్ రెడ్డి’ సంచలనం అని దాదాపు అందరూ ఒప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో ముద్దులు, బూతులు అవీ ఉన్నాయని కొందరు తిడుతున్నారు. ఈ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్ గురించి సానుకూల స్పందనలే ఎక్కువగా వస్తున్నాయి. ఇందులోని లోటుపాట్లు ప్రస్తావనకు రావడం లేదు. ఈ కొరతను తీర్చారు నవీన్ నంబూరి. ఆయన తన ఫేస్ బుక్ టైం లైన్ లో పంచుకున్న ఈ సమీక్ష పలువురిని ఆకట్టుకుంటోంది. అర్జున్ రెడ్డి సినిమాలోని సానుకూల, ప్రతికూల అంశాలను నిగ్గదీస్తూ వచ్చిన చక్కని సమీక్ష ఇదేనని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఆ సమీక్షలోకి రండి మరి..

Naveen Namuburi గారి సౌజన్యంతో..——

రాబర్ట్ బ్రెస్సోన్ సినిమాల్లోని సింప్లిసిటీ, ఆంటోనియోని సహజత్వం ఇంకెవరి సినిమాల్లో వుండదంటాడు టార్కావ్‌స్కీ. సింప్లిసిటీ, పొయెటిక్ బ్యూటీ కలగలిపిన రియలిజం సినిమాల్లో చూపగలిగడం అంత సులువేమీ కాదు. ప్రపంచ సినిమాలో దిగ్గజ దర్శకులు అని చెప్పుకోదగ్గవారిలో చాలామంది సింప్లిసిటీకి గొప్ప స్థానం ఇచ్చిన వారే. సత్యజిత్ రాయ్ సినిమాలు చూసినవాళ్ళకు సంభ్రమం కలిగించే విషయం, చాలా సాధారణంగా అనిపించే నిజజీవితపు దృశ్యాలు రాయ్ చేతిలో పడగానే ఎంతో అసాధారణమైన రంగురంగుల రసవత్తర చిత్రంలా ఎలా మారుతాయనేది. గత దశాబ్దంలో వచ్చిన సినిమాల్లో విక్రమాదిత్య మోత్వానీ తీసిన ఉడాన్ హిందీ సినిమాల్లో బెంచ్‌మార్క్ ఫిలిం. సింప్లిసిటీ, పొయెటిక్ బ్యూటీ, రియలిజం అలా గొప్పగా కుదిరిన సినిమాలు అతి తక్కువ భారతీయ సినిమాలో. రియలిస్టిక్ సినిమాల్లో గరమ్ హవా, గులాల్, హజారోఁ క్వాహిషే ఐసీ వంటి సినిమాలు చూసినప్పుడు కలిగే ఉద్వేగపూరిత ఆనందం ప్రేక్షకుడికి సినిమా అనేది ఆర్ట్ ఫామ్ అన్న నమ్మకాన్ని సజీవంగా ఉంచే ప్రేరకం.

ఈ స్పేస్ లో తెలుగు సినిమాలో చెప్పుకోవడానికేముంది? పెద్ద అగాథం వుంది. పూడ్చేవారెవరని ఎదురు చూస్తూ గడిచిన ఏళ్ళున్నాయి. ఇన్నేళ్ళకు ఆ గ్యాప్ పూడ్చే ప్రయత్నం చేస్తూ ఓ సినిమా వచ్చింది!

బీచ్‌లో తెల్లని తెరల మధ్య కావిలించుకున్న ఓ జంటను చూపిస్తూ ఇవి రెండు శరీరాల్లా కనిపిస్తున్నా ప్రాణం ఒక్కటే, వీరిని విడదీసే శక్తి ఈ ప్రపంచంలో దేనికీ లేదు అని ఓ పొయెటిక్ వాయిస్ ఓవర్‌తో మొదలయే ఈ సినిమా మొదటి కొన్ని సీన్లలోనే ఆషామాషీగా తీసిన సినిమా కాదని అర్థమయిపోతుంది. కథంటూ పెద్దగా ఏమీ లేదు. సింపుల్‌గా చెప్పాలంటే కొన్నేళ్ళ పాటు ఓ వ్యక్తి ప్రయాణం, ఆ క్రమంలో భగ్నమైన అతని ప్రేమకథ. కాకుంటే ఆ వ్యక్తి ఎవరు, ఎలాంటి వాడు, అతని ప్రత్యేకత ఏమిటి అనే వివరాలు ఈ సినిమాకు వెన్నెముక. జీవితంలోని నిస్సారమైన భాగాలన్నీ తీసేస్తే మిగిలేదే డ్రామా అంటాడు హిచ్‌కాక్. సాధారణ వ్యక్తుల జీవితంలో సంవత్సర కాలాన్ని ఎడిట్ చేస్తే కొన్నిగంటల డ్రామా దొరుకుతుందేమో. అలాంటిది ఒక వ్యక్తి జీవితంలో ప్రతి క్షణంలోనూ నాటకీయత నిండి వుంటే? అది కూడా స్వభావరీత్యా, సహజంగా, ఏ సంకల్పమూ లేకుండానే ప్రతి క్షణం అనేక భావాల వూగిసలాటకు గురి చేసే వ్యక్తిత్వం. అలాంటి మనిషి జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం. అతని కోపం, అతని బాధ, అతని ప్రేమ, అతని ప్యాషన్, అతని జీవన శైలి, ఆఖరుకి అతడు ఊపిరి పీల్చడంలోని తీవ్రత కూడా ప్రేక్షకుడు అనుభూతి చెందాలని దర్శకుడు అనుకున్నాడు.

సంపన్న కుటుంబానికి చెందిన ఓ ప్రివిలేజ్డ్, ఎడుకేటెడ్, ఎక్సెంట్రిక్ మెడికో అర్జున్ రెడ్డి. హై ఇంటలెక్ట్, ఫ్రీ స్పిరిటెడ్‌నెస్, బోహేమియన్ లైఫ్ స్టైల్ అతనిది. ఏమైనా చెయ్యగలననే కాన్ఫిడెన్స్. జిమ్ మారిసన్‌లా కన్ఫర్మిస్ట్ ప్రపంచానికి మిడిల్ ఫింగర్ చూపెట్టగలిగే రెబలియస్ అవుట్ కాస్ట్ లక్షణాలు. అనుకోగానే అన్నీ జరిగిపోవాలనుకునే రెస్ట్‌లెస్‌నెస్. అథారిటీని లెక్కచేయని రెక్‌లెస్‌నెస్. నథింగ్ లెస్ దేన్ గ్రేట్‌నెస్ ఈజ్ యాక్సెప్టబుల్ బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకునే వ్యక్తిత్వం. తన వృత్తి మీద గౌరవం. వీటికి తోడు యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్. అనుకోగానే బీచ్ హౌస్, చుట్టూ అడ్మైర్ చేసే స్నేహితులు. ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న కాలేజి వాతావరణం. డిప్రెషన్ నుంచి రికవర్ అవడానికి ఇటలీ హాలిడే… మసూరీ, మంగళూరు మధ్య తిరగడానికి ఫ్లైట్ టికెట్లు అలవోకగా అమిరే వీలున్న ప్రేమకథ అతనిది. ఒక వర్గానికి చెందిన రియాలిటీ అన్నమాట.

అతనిది అంతా వన్ సైడెడ్ పద్ధతి. కాలేజిలో కొత్తగా చేరిన అమ్మాయిని చూడగానే ప్రేమలో పడడమే కాక రెండో ఆలోచన లేకుండా ఆ అమ్మాయిని ‘ఓన్’ చేసుకునేంత పొసెసివ్‌నెస్, ధైర్యం, పిచ్చి అతనివి. ఒక రకంగా చూస్తే పూరి జగన్నాథ్ ఇడియట్ తరహా ప్రవర్తన. కానీ ఈ క్రమంలో డిగ్నిటీ కోల్పోని స్వభావం.

కర్నాటకలో ఓ మెడికల్ కాలేజీలో మొదలయే ఈ ప్రేమకథలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టిందనేది అసలు పాయింటే కాదు. హీరో హీరోయిన్ని చూడగానే ఇష్టపడతాడు. ఇక్కడ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూతో దర్శకుడికి పనిలేనట్టుంది. ఇతర పాత్రలేవీ అర్జున్ రెడ్డిని డామినేట్ చేసే అవకాశం లేకుండా జాగ్రత్త వహించారు. హీరో ఫ్రెండ్ ఒక్కడే కాస్త మినహాయుంపు. హీరోయిన్ సాదాసీదా అమ్మాయి. తిట్టినా, పోట్లాడినా, వదిలిపెట్టకుండా వెంట వుండే లాయల్టీ హీరో స్నేహితుడిది.

ప్రేమలోని గాఢత చూపే క్రమంలో వచ్చే ముద్దులు, శృంగార సన్నివేశాలు హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనపై ఆధారపడి తీసిన ఎన్నో తెలుగు సినిమాలతో పోలిస్తే ఎంతో సంస్కారవంతంగా వున్నాయి.

అంతటి గాఢమైన ప్రేమకూ ఈ భౌతిక ప్రపంచంలో ట్రివియల్ అనిపించే కష్టాలు, అపార్థాలు తప్పవు. కొన్ని సంఘటనల దరిమిలా అద్భుతమైన, అలౌకికమైన ప్రేమకథ కాస్తా నేలమీదకు దిగి ప్రేమికులు విడిపోవాల్సి వస్తుంది. కథానాయకుడి వన్ సైడెడ్, రాజీపడలేని వ్యక్తిత్వం ఈ పరిస్థితికి దారి తీస్తుంది. ఇప్పుడిక పర్యవసానం అనుభవించాల్సింది హీరోనే. సినిమా సెకండాఫ్ అంతా అందుకే కేటాయించాడు దర్శకుడు.

నీరాజనం సినిమాలోలా నాయకుడికి ఇక్కడ నార్సిసిస్టిక్ మార్టిఫికేషన్, సెల్ఫ్ డిస్ట్రక్షన్ టెండన్సీలు లేవు. దేవదాసు పోలికలు దర్శకుడు సింబాలిగ్గానే పెట్టినట్టున్నాడు. ఎస్కేపిస్ట్, మాసోకిస్ట్ టెండన్సీల్లా కనిపించేవంతా భరించలేనంత బాధను డీల్ చేసే క్రమంలో అతని పోరాటంగా పుట్టినవే కాని, అవే ఫోకల్ పాయింట్లు కావు. ఇదో ఫేజ్ అంతే. నన్నొదిలేయండి… అనేంత అవగాహన వుంటుంది నాయకుడికి. అయినా బయట పడలేని బలహీనత. ప్రేమ అనేది మిగతా ప్రపంచానికి ఎలాంటిదైనా అతనికి మాత్రం అది ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. తన ప్రేమను సర్వోన్నతంగా వూహించుకుని తను ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఎవరయినా ఫెయిలవ్వాల్సిందే అని నమ్మేంత ఇన్‌కారిజిబుల్ ఇడియట్ హీరో. ఆఖరికి తన క్లోజ్ ఫ్రెండ్ అతడు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నానని చెప్తే యు ఆర్ అన్‌వర్తీ ఆఫ్ లవ్ అని తిడతాడు.

విజయ్ దేవరకొండ నటుడిగా ఈ సినిమాలో ఓ రివిలేషన్. చూడటానికి రాజా పోలికలు, డైలాగ్ డెలివరీలో,డిక్షన్లో అలాంటివే లిమిటేషన్లున్న విజయ్ నటనలో మాత్రం అదరగొట్టాడు. సినిమా సినిమాకీ ఏమాత్రం మారని అతని డిక్షన్ చూస్తే వన్ ఫిలిమ్ వండర్ అవుతాడేమో అనుకోవడం సహజం. ఆ అభిప్రాయం ఎంత తప్పో ఈ సినిమాతో నిరూపించాడు. ఛార్మ్, హీరోయిజం, కామెడీ, ఎంటర్టెయిన్మెంట్ లాంటి వాటి మీద ఫోకస్ చేయకుండా తన పాత్రలోని ఇంటెన్సిటీని వ్యక్తపరచడంలో నూరు శాతం నిమగ్నమయ్యాడు. అతను చేసినంత గొప్పగా ఈ పాత్రను తెలుగు నటులింకెవరైనా పోషించగలిగేవారా అనేది అనుమానమే. గులాల్‌లో అభిమన్యు సింగ్, టాక్సీ డ్రైవర్ లో రాబర్ట్ డి నీరోల ఇంటెన్సిటీ ఓ తెలుగు సినిమా కేరెక్టర్ లో కనబడితే ఆశ్చర్యం కలగక మానవు.

హీరో ప్రవర్తన ఎంత ఎక్సెంట్రిగ్గా అనిపించినా ప్రేక్షకుల ఎంపతీని కోల్పోదు. విజయ్ ఈ పాత్రకు తెచ్చిపెట్టిన నేచురల్ ఛార్మ్ కావచ్చు. అలాంటోడు ఒకడున్నాడు. వాడలాగే వుంటాడు. ఇష్టపడతావో, అసహ్యించుకుంటావో నీ ఇష్టం అని ప్రేక్షకుడికి వదిలేసాడు దర్శకుడు.

హీరోయిన్ శాలిని క్యారెక్టరైజేషన్ మొదట్లో అంతా హీరో పప్పెట్లా అతను చెప్పినట్లు చెయ్యడమే అన్నట్టుగా వున్నా తర్వాత వచ్చే సన్నివేశాల్లో ఎమోషనల్ స్ట్రగుల్‌ని బాగానే వ్యక్తపరిచింది. తన పాత్ర పరిమితులు అర్థం చేసుకుని నటించింది. అన్నిటికీ మించి విజయ్ దేవరకొండతో శాలిని కెమిస్ట్రీ బాగా వర్కవుటయింది. సెకండాఫ్ అంతా దాదాపుగా హీరోయిన్ కనిపించదు. కాని ఆమె పాత్ర గురించి మరిచిపోయే అవకాశమే రాదు. ఆమెను పోగొట్టుకున్న హీరో బాధ తప్ప ఇంకేమీ వుండని సన్నివేశాలు. లెంగ్త్ ఎక్కువయినా బోరు కొట్టదు.

విజయ్ ఫ్రెండ్ కేరెక్టరు వేసిన రాహుల్ రామకృష్ణ ఈ తరహా సినిమాలకు వరం లాంటి యాక్టర్. కళ్ళలో వత్తులేసుకుని వెదికినా ఆ పాత్రకు అలాంటి అర్నెస్ట్నెస్, రియలిస్టిక్ పోర్ట్రేయల్ ఇవ్వగలిగే నటులు దొరకడం కష్టం.

అలనాటి నటి కాంచన తన పాత్రకు ఎంత హుందాతనాన్ని తెచ్చిపెట్టిందంటే, సినిమాలో విజయ్ పాత్ర ఎక్సెంట్రిసిటీని కౌంటర్ బ్యాలెన్స్ చెయ్యడానికి ఆవిడ పాత్ర చాలా పనికొచ్చింది. హీరోయిన్ తండ్రి వేషం వేసిన యాక్టర్ విజయ్ ఇంటెన్సిటీ ముందు బలంగా నిలబడి స్టాండవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, హీరో స్నేహితులు, పనమ్మాయి, ఈ సినిమాలో ప్రతి కేరెక్టర్‌కీ సొంత వ్యక్తిత్వం, నడవడిక వున్నాయి.

దర్శకుడి సందీప్ రెడ్డి గురించి చాలా చెప్పుకోవాలి. ఈ కథ, స్థలకాలాలు, పాత్రలు, సంభాషణలకు అతడు ఇచ్చిన ఆథెంటిసిటీ మామూలుది కాదు. ఈ ప్రయత్నంలో ప్రిటెన్సెస్ ఏమీ లేవు. సినిమాను సింపుల్గా ఆర్గానిక్‌గా తీసుకుంటూ వెళ్ళాడు. ముక్కలు ముక్కలుగా సీన్లు అతికించినట్లు కాక జీవితాన్ని ఒక ఫ్లోలో చూస్తున్నట్లే వుంది సినిమా అంతా. సంస్కారం, సభ్యత అంటూ మొహమాటాలేమీ పెట్టుకోకుండా, అనుకున్న కథను అనుకున్నట్లు తీయడానికి దర్శకుడు ఎక్కడా రాజీ పడలేదని తెలుస్తూనే వుంది. కథను ముందుకు తీసుకెళ్ళే క్రమంలో డేవిడ్ ఫించర్ సినిమాల్లోలా ప్రతి చిన్న డీటెయిల్నీ ప్రేక్షకుడికి పరిచయం చేస్తూ ఆర్గానిక్‌గా కదిలే సీన్లతో, పాత్రలను జడ్జ్ చేసే పని ప్రేక్షకుడికి వదిలేసి దర్శకుడు తన మానాన తను అర్జున్ రెడ్డి తరవాత ఏం చేస్తాడు అనే ప్రశ్నకు జవాబు వెతుక్కుంటూ పోయాడు. ఆఖర్లో భగ్నప్రేమికులకు అంకితం అంటూ ఓడ్ చదవడం దర్శకుడికిదెంత పర్సనల్ సినిమానో తెలియజేస్తుంది.

ఇగో, క్షణికావేశం, స్వభావసిద్ధమైన కోపం యొక్క పర్యవసానాలవల్ల ఎలా అఫెక్టయారు అనే విషయం తెలుసుకోడానికి మూడు గంటల సినిమా తీయనల్కర లేదు. కాని ప్రేమలో ఇంత ఇంటెన్సిటీ వుంటుంది చూడు అని అర్జున్‌తో కలిసి తిరగమని ప్రేక్షకుణ్ణి వదిలేసి ఆ ప్రయాణం కోసం మూడు గంటలు కేటాయించాడు దర్శకుడు. గులాల్‌లో అభిమన్యు సింగ్ కేరక్టరుకున్నంతటి ఫ్రీ స్పిరిట్‌ని, ఆనీహాల్‌లో వుడీ అలెన్ కేరెక్టరుకున్న ఇంటెలెక్చువల్ ఎక్సెంట్రిసిటీని ఈ కేరెక్టరులో నింపాడు. పాత్రల చుట్టూ పూర్తి లోకల్ కంటెంపరరీ వాతావరణాన్ని కల్పించాడు. మార్టిన్ స్కోర్సెసీలా స్వేచ్చగా ఎక్స్ప్లెటివ్స్ , అనురాగ్ కశ్యప్ తరహా రియలిజం, విక్రమాదిత్య మోత్వానీ సిన్సియారిటీ, అన్నిటికీ మించి నిజాయితీగా, నిక్కచ్చిగా తీసిన దర్శకుడికి, అంతకు మించి అతన్ని నమ్మి ఈ సినిమా తీసిన దమ్మున్న ప్రొడ్యూసర్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి.

ఒక రకంగా చెప్పాలంటే అగ్రవర్ణానికి చెందిన అండర్టోన్లు సినిమా అంతా వున్నాయి. కానీ అవి కావాలని పెట్టినట్లు కాక కథ పట్ల, తనకు తెలిసిన పాత్రల స్వభావం పట్ల దర్శకుడి నిజాయితీ వల్ల సహజంగా వ్యక్తమైనవే తప్ప, అగ్రవర్ణ భావజాలం ప్రదర్శించే వుద్దేశం ఎక్కడా కనబడదు.

తిథితో రామ్ రెడ్డి కంటెంపరరీ రూరల్ కథతో సాధించినదానికి కాస్తోకూస్తో దగ్గరగా ఈ సినిమాలో మెయిన్‌స్ట్రీమ్ అర్బన్ ట్రీట్‌మెంట్‌తో సందీప్ రెడ్డి సాధించాడు.

నేపథ్యంలో ఎంచుకున్న పాటలు, సంగీతం అన్నీ దర్శకుడి అభిరుచిని పట్టించేవే. హీరో మత్తులో మగతగా పడున్న స్థితిలోనూ బిల్ విదర్స్ ఏ నో సన్‌షైన్ వెన్ షి ఈజ్ గాన్ అని పాడుతుంటాడు. ఓపెనింగ్ టైటిల్స్ నుంచి చివరి దాకా ఈ కథకు తగ్గ ఇంటెన్సిటీని, మూడ్‌ని ఎలివేట్ చేయడంలో నేపథ్య సంగీతం పాత్ర చాలా వుంది. దర్శకుడికి రైటింగ్ పరంగా పడ్డన్ని మార్కులు సంగీత దర్శకుడు రాధన్‌కి కూడా ఇవ్వాలి. ఎక్కడ మ్యూజిక్ అవసరమో ఎక్కడ లేదో గుర్తెరిగిన టీం వర్క్ ఎండ్ ప్రాడక్ట్ క్వాలిటీలో స్పష్టంగా తెలుస్తుంది.

డైలాగ్ రైటింగ్ టాప్ క్లాస్‌గా వుంది. సఫరింగ్ ఈజ్ పర్సనల్. ఐ లవ్ ద వే యు బ్రీత్ లాంటి రియలిస్టిక్‌గా అనిపిస్తూనే గాఢత, తీవ్రత తగ్గకుండా రాసిన సంభాషణలు, హీరో స్నేహితుడు అతని తండ్రి మధ్య హీరో పరిస్థితి గురించి జరిగే సంభాషణ, హీరోకు అతడి స్నీహితుడికి మధ్య సంభాషణలు అసలు సిసలు న్యూ ఏజ్ రైటింగ్‌ని తెలుగు సినిమాకు పరిచయం చేస్తాయి.

మెయిన్ స్ట్రీం కమర్షియల్ సినిమాల్లో ఇలాంటి రియలిస్టిక్ పోర్ట్రేయల్, ఇలాంటి మేకింగ్ విలువలు, కాస్టింగ్, దర్శకుడు, ఇతర సాంకేతిక విభాగాలు తెలుగు సినిమాల్లో చూడలేమనుకునేంత క్వాలిటీ చాన్నాళ్ళకు తెలుగు సినిమా భవిష్యత్తు మీద కొత్త ఆశలు కలిగేలా చేస్తున్నాయి.

లోపాల విషయానికొస్తే…ఎక్కడా పేరు పెట్టలేనట్లున్న సినిమాను క్లైమాక్స్‌లో నీరు కార్చేసాడు దర్శకుడు. మీరు ఇంతవరకు చూసిందంతా తూచ్ అన్నట్లు చాప చుట్టేసి సినిమాకు రొటీన్ ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు. అగ్నిప్రవేశం చేసిన సీతకు మల్లే తన పవిత్రత గురించి క్లారిఫికేషన్లు కూడా ఇస్తుంది పాపం హీరోయిన్. ఆ మాత్రం ఆలోచన ప్రేక్షకుడికి మేధస్సుకు ఎందుకు వదిలేయలేదో మరి. కానీ ఆ లెట్ డవున్ అనుకున్న క్లైమాక్స్ కూడా చూడడానికి ఇబ్బందనిపించేలా లేదు.

బీచ్‌లో పరుపేసుకుని పడుకోవడం పొయెటిక్ వాల్యూ కోసం కావచ్చు కాని ఈ సినిమాలో అంతగా అతకనట్లు అనిపించింది. ఎన్నిసార్లు సెక్స్ చేసుకున్నారో లెక్కపెట్టడంలో లస్ట్ తప్ప ఇజాజత్ మేరా కుచ్ సామాన్ పాటలో ఎక్ సౌ సోలా చాంద్ కి రాతే అన్నంత పెయిన్‌ఫుల్ సెన్సువాలిటి ఏమీ లేదు.

ఓ సన్నివేశంలో హీరో వుమెన్ ఆబ్జెక్టిఫికేషన్ గురించి మాట్లాడతాడు గాని, అంతకుముందు లావుగా వున్న అమ్మాయిల మీద కామెంట్లు చేస్తాడు. బ్రేకప్ తరువాత ఫేజ్‌లో ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ లేని అఫేర్లతో గతం మరిచిపోదామని చూసిన హీరో గురించి ప్రేక్షకుడు ‘తప్పుగా’ భావించకుండా తన ఇంటికొచ్చే ఆడాళ్ళతో అతని రిలేషన్‌షిప్ గురించి క్లారిఫికేషనిచ్చి అతని పవిత్రత పనిగట్టుకుని కాపాడడం దర్శకుడు అనవసరంగా చేసిన పని.

బూతులు, అసభ్యత, సమాజం ఏమైపోతుంది అంటూ వాపోతున్న జనం ఏ సర్టిఫికెట్ చూసి ఆగిపోయే వీలుందని గుర్తు చేసుకోవాలి. టీజర్, ట్రైలర్లలో ముద్దు సన్నివేశాలు చూసి సంస్కారం, విలువలు అని గోల పెట్టిన శీలవంతులు, నీతివర్తనుల కోసం సినిమాలో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే సన్నివేశాలనేకం వున్నాయి. సినిమాతో పోలిస్తే టీజర్ నథింగ్. కానీ వాటిలో సెక్స్ పాళ్ళు చాలా తక్కువ. డైరెక్టర్ దృష్టంతా హీరో పాత్ర పడుతున్న సముద్రమంత బాధను చూపెట్టడం మీదే కాని బోల్డ్ సన్నివేశాలను క్యాష్ చేసుకునే ప్రయత్నం ఇంచుకైనా కనిపించలేదు.

గొప్ప ఫిలిం మేకర్లకు సెక్స్ అనేది ఒక మామూలు దినుసు. ప్రకృతి అవసరం. అంతకంటే దాని ప్రాధాన్యత వుండదు. కిస్లోవ్స్కీ త్రీ కలర్స్ బ్లూలో ప్రియుడి కంటిపాపలో ముడుచుకుని కూర్చున్న హీరోయిన్ నగ్నదేహపు ప్రతిఫలనాన్ని చూపిస్తాడు. అందులో ఏ అసభ్యత లేదు. ఆ పాత్ర ఆత్మను ప్రేక్షకుడికి చూపాలని దర్శకుడు పడే తాపత్రయమే వుంది. ప్రతిద్వందిలో ధృతిమాన్ చటర్జీ పాత్ర స్నేహితుడు తీసుకువెళ్తే వేశ్య దగ్గరికి వెళ్తుంది. అక్కడ మేఘసందేశంలో నర్తకి, మల్లెపూవులో హీరోయిన్ వుండరు. రియాలిటీ వుంటుంది. అరణ్యేర్ దిన్ రాత్రి లో ఓ సీన్ వుంటుంది. వయసులో వున్న విధవరాలు శారీరక సుఖం కోసం తపించే సీన్. అది చూసి రాయ్ సెక్సువల్ డిజైర్‌ని హైలైట్ చేశాడని అనుకునేవాళ్ళుంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే. కొండపై వున్న గుడికెళ్ళాలంటే మనం మెట్లెక్కి నడుచుకుని వెళ్ళాలి గాని మనకోసం గుడిలో దేవుడు దిగి రాడు.

ఆఖరుగా చెప్పాలంటే అర్జున్ రెడ్డి ఒక అవుట్ స్టాండింగ్ ఫిలిం. సంస్కారాల అడ్డుగోడలు కూల్చేసి ఏ ప్రిటెన్సెస్ లేకుండా తీసిన ఆర్టిస్టిక్ రియలిజం. రియలిస్టిక్ ఆర్ట్. కాదు రియల్ ఆర్ట్. తెలుగు తెరపై ఇంతకుముందెప్పుడూ ఇలాంటి చిత్రం రాలేదు. ట్రెండ్ సెట్టర్ అని అడ్డమైన సినిమాలనూ అంటుంటారు కాని ఈ సినిమా ఆ పదానికి సరైన నిర్వచనం. సందీప్ రెడ్డికి డైరెక్టరోంకా బాప్ అనిపించుకునే సత్తా వుంది. తనతో సమానమైన తెలివి ప్రేక్షకులకు వుంటుందని నమ్మి తీస్తే మరిన్ని ఇంకా గొప్ప సినిమాలు తీయగలడు.

పి. ఎస్: నా 2017 టాప్ 10 లిస్టులో ఒకటి నుంచి పదో స్థానం వరకు ప్రస్తుతం అర్జున్ రెడ్డి పేరే వుంది. ఈ సంవత్సరం ముగిసే లోపు అందులో ఏదో ఒక స్థానానికి పోటీ పడే సత్తా వున్న ఇంకో సినిమా వస్తుందేమో చూద్దాం. జవాబేంటో నాకు ఆల్రెడీ తెలుసు.