వారసత్వ హీరోలకు గొడ్డలిపెట్టు!  - MicTv.in - Telugu News
mictv telugu

వారసత్వ హీరోలకు గొడ్డలిపెట్టు! 

August 29, 2017

60 ఏళ్లు పైబడిన ‘యువ’హీరోల కుమ్ముళ్లు, తొడగొట్టాడాలు, నటనలో ఓనమాలు కూడా రాని వారి కొడుకులతో కునారిల్లుతున్న తెలుగు సినీ పరిశ్రమంలో విజయ్ దేవరకొండ ఇప్పుడో సంచలనం.ఒక నయాగరా జలపాతం. ఎలాంటి బలమైన బ్యాక్ గ్రౌండ్, పలుకుబడి, మీడియా మేనేజ్ మెంట్.. తాతతండ్రుల వారసత్వం బలుపులేవీ లేకుండా కేవలం నటనతోనే ఈ స్థాయి చేరుకున్నాడు కుర్రోడు.

శక్తిమంతమైన నటన, సహజంగా పలికే ఉద్వేగాలతో ‘అర్జున్ రెడ్డి’ తెలుగు యువత మనసు దోచుకుంటున్నాడు. ఆ సినిమాలో బూతులు, ఇతరత్రా అంశాలెలా ఉన్నా విజయ్ తెలుగు సినిమాలో ఒక మైలురాయిగా నిలిచిపోతాడు. ఇది అతని కెరీర్ కు మాత్రమే కాకుండా మొత్తం సినీ పరిశ్రమకు, ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే యువతీయువలకు కొండంత ఆశాభావాన్ని, ఊతాన్ని ఇవ్వనుంది. పవన్ కల్యాణ్ కంటే విజయ్ పది రెట్లు బెటర్ అని రామ్ గోపాల్ వర్మ అన్నాడంటే విజయ్ టాలెంటేమిటో అర్థం చేసుకోవచ్చు.

తెలుగు సినిమా అంటే విగ్గుల హీరోలు, వారి మనవాళ్ల వయసులో ఉండే హీరోయిన్లు, పంచ్ డైలాగులు, తొడలు, జబ్బలు వగైరా చరడాలు.. అని కదా ముద్ర ఉన్నది. ఈ మూస మాస్ ఇమేజీని ‘అర్జున్ రెడ్డి’ చావు దెబ్బ తీశాడు. అంతకు ముంచి సినీ రంగంలో పాతుకుపోయిన ఆధిపత్యాన్ని కూడా కూలదోశాడు..

ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో రాజ్యమేలున్న యువహీరోల్లో దాదాపు అందరూ వారసత్వ హీరోలే. వాళ్ల తాతలు, తండ్రులు, మామలు, బాబాయిలు నటులు, స్టూడియో నిర్మాతలు గట్రా గట్రా. విజయ్ కి కూడా కళారంగ నేపథ్యమున్నా అది చాలా సాధారణ స్థాయిది.  వాళ్ల నాన్న టీీవీ సీరియళ్ల దర్శకుడు అంతే. ఈ వారసత్వ హీరోలతో ఎక్కడా, ఎందులోనూ పోటీపడే స్థాయి దానికి లేదు. అయినా విజయ్ తన సహజసిద్ధమైన నటన, లుక్స్ తో అదరగొట్టుస్తున్నాడంటే అది కేవలం అతని శ్రమ ఫలితం మాత్రమే. వారసత్వం హీరోలతో పోలిస్తే దేవరకొండ చాలా భిన్నం. ఆ హీరోలను బలవంతంగా ప్రేక్షకుల కళ్లపైన రుద్దారు. వాళ్లలో కొందరు హీరోలయ్యాక నటన నేర్చుకుంటున్నారు.  కొందరు బలవంతంగా నటిస్తున్నారు. తాతల, తండ్రుల బాటలోకి దిగజారి పోతున్నారు.  ఎలాంటి ప్రయోగాలూ చేయకుండా రొడ్డకొట్టుడు ఫైట్లు, పాటలు, పంచ్ డైలాగులతో జనాన్ని కాల్చుకుతింటున్నారు. వారిలో కొందరు మాడ్యులేషన్ అంటే ఏంటో నేర్చుకుంటున్నారు. కొందురు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. అయితే వీరిలో మంచు మనోజ్ వంటి  కొందరు మూసకు భిన్నంగా వెళ్తూ, ప్రయోగాలు కూడా చేస్తున్నారు. తమ సత్తా చాటడానికి యత్నిస్తున్నారు. కానీ వాళ్ల బ్యాగ్రౌండ్ అందుకు సహకరించడం లేదు. వాళ్లకిది గుదిబండే. కానీ విజయ్ స్వేచ్ఛా ప్రియుడు.  పూవు పూసినంత సహజంగా, పిల్లగాలి వీచినంత హాయిగా ఉంటుంది అతని నటన. అర్జున్ రెడ్డి పాత్రను పోషించిన తీరు చాలు మిగతా హీరోలీకు అతడెంత భిన్నమో చెప్పడానికి.

అర్జున్ రెడ్డి  సినిమా ఆడియో ఫంక్షన్ లో విజయ్ దూకుడుగా మాట్లాడ్డం వెనక అర్జున్ రెడ్డి కేరక్టర్ ప్రభావం కనిపిస్తోంది. ఎదగడం కోసం  ఎవ్వడికీ సలాములు కొట్టొద్దని అన్నాడు విజయ్.  తెలుగు సినిమా రంగాన్ని శాసిస్తున్న కొందరు సైకో శాసనకర్తలకు చెంప పెట్టులాంటి సమాధానం ఇది. .

విజయ్ వాళ్ళ నాన్న వర్ధన్ దేవరకొండ. తను అప్పట్లో వచ్చిన సక్సెస్ ఫుల్ టీవీ సీరియల్ ‘ భార్యమణి ’ కి డైరెక్టర్. చాలా సీరియళ్ళకి దర్శకత్వం వహించాడాయన. తన సక్సెస్ వెనుక అపారమైన అనుభవమున్న తండ్రి ఐడియాలజీ తప్పకుండా వుంటుంది అతని ఎదుగుదలలో. ఇకపోతే ఒక్కసారిగా తెలుగు సినిమా హీరోలందరికీ ఇప్పుడు రోల్ మోడల్ అయ్యాడు విజయ్. విజయ్ విజయాల పరంపరం ఇలాగే కొనసాగుతూ పైన చెప్పుకొన్న వారసత్వ హీరోలకు గొడ్డలిపెట్టే..! ఎలాండి బ్యాగ్రౌండు, బ్రాండు ఇమేజీ లేని నవతరం యువతారలకు రాజమార్గమే.. !

ఇంతెందుకు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. వారసత్వ హీరోల గుండెల్లో విజయ్ దేవరకొండ అనే బుల్లెట్ రైలు ధడ్ ధడ్ ధడ్ అని పరుగెడుతూ దడ పుస్తోది.. !!