ఓ మహిళ దృష్టిలో ‘అర్జున్ రెడ్డి’ - MicTv.in - Telugu News
mictv telugu

ఓ మహిళ దృష్టిలో ‘అర్జున్ రెడ్డి’

September 1, 2017

ఎన్నో సినిమాలు వస్తున్నాయి , పోతున్నాయి . కానీ  ఆ సినిమాల్లోని  కంటెంట్ గురించి, పాత్రల గురించి పెద్దగా చర్చలకు రావడం లేదు. విచిత్రంగా అర్జున్ రెడ్డి సినిమాను జడ్జ్ చేయడానికి మాత్రం పోటీలు పడుతున్నారు అందరూ.

మొన్నటిదాకా ‘దువ్వాడ జగన్నాథం’ అనే సినిమాలో, ట్రయలర్స్ లో .. ఎన్నాళ్లిలా సెల్ఫీ లు కొట్టుకోవాలి అని చేయి పిసుక్కుంటూ హీరో హీరోయిన్ తో చెప్పిన డైలాగ్ మీద ఎవరికీ అభ్యంతరాల్లేవు. అది ట్రయలర్స్ లో వందలు, వేలసార్లు టీవీల్లో టెలికాస్ట్ అయినా ఎవరూ జడ్జ్ చేయడానికి ముందుకు రాలేదు.  పెళ్లయిన వెంటనే పిల్లలొద్దు అని హీరోయిన్ అంటే, చిన్నప్పుడు కాళ్ళకి సాక్సులే వేసుకోలేదు అని మాట్లాడటం గురించి చర్చించరు. కానీ అర్జున్ రెడ్డి సినిమా చూసి పిల్లలు పాడయిపోతారని , సమాజం మీద నెగిటివ్ ప్రభావం ఉందని మాట్లాడతారు..

ఒక అమ్మాయి చుట్టూ కొంతమంది చేరి ఎప్పుడెప్పుడు ఆమెను ముట్టుకుందామా అనేటట్టు డాన్సులు చేస్తే ప్రొవోకింగ్ గా ఉండదు. ఐటెం సాంగ్స్ అని తేలిగ్గా తీసుకుంటారు.నీతులు చెప్పే హీరోని.. ఐటెం సాంగ్ లో డాన్స్ చేసే అమ్మాయి ఎప్పుడెప్పుడు నువ్వు నన్ను తాకుతావు, పక్కలో పడుకుంటావు అంటూ మీద మీద పడితే, అప్పుడు హీరోయిజం సాటిస్ ఫై అవుతుంది..ఫ్యాన్స్ ఈలలు కొడతారు. కాని వీటి వల్ల సమాజం చెడు ఏమీ నేర్చుకోదు పాపం.. సంస్కృతీ, సంప్రదాయాలకు భంగం కూడా  కలగదు..

‘అరె మామా ఏక్ పెగ్ లా’ ..అనే పాటలో ఓ నలుగురమ్మాయిలు ఒకేసారి హీరో ఛాతీ  మీద, వెనక చేతులేసి అదోలా తడుముతుండటం హీరోయిజం.. ఆ పాటలో హీరోయిన్ వస్త్రధారణ ఆమోదయోగ్యం.. కానీ అర్జున్ రెడ్డి సినిమాలో ఇలాంటి ప్రదర్శనలు, డాన్సులు లేవు..కానీ హీరో, హీరోయిన్లు ముద్దు పెట్టుకోవడం పెద్ద అభ్యంతరకరమైన విషయం. యువత ను చెడగొట్టే విషయం..ఇక తల్లిదండ్రులను అత్యంత భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయం..!

పూర్తిగా మైండ్ బ్లాంక్ చేసే రివ్యూ అంటూ పబ్లిసిటీ చేసుకుంటున్న వాళ్లకి నిజంగానే మైండ్ బ్లాంక్ అయే రివ్యూ రాసి ఉంటారనిపిస్తోంది. ఎందుకంటే హీరో , హీరోయిన్ విడివిడిగా జడ్జ్ చేసి ఇద్దరి ప్రేమను విడగొట్టినట్టు సంబరపడుతున్నారు.. ఒక ప్రేమ గొప్పగా ఉండాలంటే రెండు మనసులు, ఇద్దరు వ్యక్తులు పరస్పరం ట్రాన్స్పరెంట్ గా ఒకరి వ్యక్తిత్వాన్ని ఇంకొకరు ప్రేమించి, అభిమానించి, ఆరాధించి గౌరవిస్తేనే సాధ్యం అనే విషయం తెలియక, అర్జున్ రెడ్డి సినిమాలో అర్జున్ రెడ్డి గొప్పా..ప్రీతి గొప్పా.. అనే విచిత్రమైన వాదనని తీసుకొస్తున్నారు. ఇవేవి అంగీకరించే మైండ్ సెట్ లేని వాళ్లకి అర్జున్ రెడ్డి సినిమా తలనొప్పే..

ప్రాణంగా ప్రేమించిన వాడు మూర్ఖంగా వెళ్ళిపోతే, తల్లిదండ్రులకు జరిగిన అవమానానికి ప్రీతి తలవంచి పెళ్ళిచేసుకున్నట్టు మీకు అర్థమయింది పాపం.. ప్రీతి తల్లిదండ్రులకు అవమానం జరిగినట్టు ఏ సీన్ లో కనిపించిందో చెప్తే తెలుసుకుంటాం.. మళ్ళీ కన్న తల్లిదండ్రులు,అక్క ఎదుట ధైర్యంగా కూర్చుని, వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ ‘నేను,వాడు వందల సార్లు సెక్స్ లో పాల్గొన్నాం’ అని చెప్పిన ప్రీతి బోల్డ్ అని ప్రీతికి సర్టిఫికేట్ ఇస్తున్నారు.. ఆట ఒక్కరే ఆడుకొని నేనే దొంగ, నేనే పోలీస్ అంటున్నట్టుంది..కాస్త చూసుకోండి..

అన్ రిజిస్టర్డ్ రిలేషన్ షిప్ కదా అని మా ప్రేమను తక్కువ చేసి చూడొద్దని చెప్పడం, హీరోయిన్ తండ్రి కోపంతో గెంటేస్తే, నన్ను మాట్లాడమంటవా, పొమ్మంటవా అని ప్రీతి నిర్ణయాన్ని అడగటం.. కూర్చోబెట్టి మాట్లాడు, we are not like teenagers,talk to him like a woman అని మాట్లాడటం బహుశా నచ్చి ఉండకపోవచ్చు….హీరోనే ఓ ఫైట్ చేయాలి. హీరోయిన్ నాన్న ఇగో ను హర్ట్ చేసి, లేదా physical వయొలెన్స్ చేసి హీరోయిన్ ను తీసుకెళ్ళిపోవాలి.. ఇదీ అలవాటైన ఎక్స్ పెక్టేషన్.. అమ్మో ఆడపిల్లలు ప్రేమ, రిలేషన్షిప్ గురించి woman హోదాలో మాట్లాడితే.. ఇంకేమన్నా ఉందా.. ఒకే కులం కాకుండా, వేరే కులం,వేరే మతం అమ్మాయినో అబ్బాయినో ప్రేమిస్తే..ధైర్యంగా,అదో సహజమైన విషయంలా తమ నిర్ణయాన్ని ఇంట్లో పెద్దలతో పంచుకుంటే రిసీవ్ చేసుకునే స్థితిలో మీరు లేరు..

ఈ సినిమాలో హీరోయిన్ నడుమో, బోడ్డో, కనీసం క్లివేజ్ అయిన ఎక్కడా కనిపించలేదే.. హీరోయిన్ కాకపోతే రెగ్యులర్ నీతి సినిమాల్లా ఓ ఐటెం సాంగ్ కూడా లేదు ఎవరో ఒక అమ్మాయిని objectify చేసి చూద్దామంటే…లావుగా ఉన్న మనుషుల చర్మం బక్కగా ఉన్నవాళ్ళకంటే కొంచెం దళసరిగా ఉంటుందని, శరీరం వెచ్చగా ఉంటుందని చెప్పడంలో స్కూల్ లో చదువుకున్న సైన్స్ కాక బూతు ఏంటో అర్థం కాలేదు..ఇంక దీనికీ pms గురించి లింక్ పెట్టి డిస్కస్ చేయడం బోనులో పడ్డ ఎలుక కథ లాగా ఉంది..

రెస్పాన్సిబిలిటీ అంటే ఏమేం చేయాలో, పర్వెర్ట్ అంటే ఎట్లా ఉంటారో నిర్వచించి చెప్పండి.. లేదంటే దర్శకుడు సందీప్ కి చెప్పాల్సింది ముందే.. మీ ఇగో satisfy అయేటట్టు, మీకు తెలిసిన , నచ్చిన లక్షణాలను హీరోకి పెట్టెటోడు.. ఇంగువ లేకుండా పులిహోర చేస్తూ సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చిన హీరో లక్షణాలు, డైలాగ్ లు కొన్నయినా అర్జున్ రెడ్డి సినిమాలో కనిపించేవి.. ఒకవైపు కండోమ్స్ వాడకం గురించి మాట్లాడిన మీ బోల్డ్ నెస్ ని, 23 ఏళ్ళ అమ్మాయిని గర్భవతిని చేయడం అనే మాట మింగేసినట్టుంది..

వందలో 99 శాతం శారీరక ఆకర్షణ, లేని   ప్రేమలు,పెళ్ళిళ్ళు, వైవాహిక జీవితాలు, సహజీవనాలు ఉంటాయా..ఈ సినిమాలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ ని వ్యతిరేకిస్తున్నవాళ్ళూ ఉన్నారు..లవ్ ఎట్లా పుట్టాలో గైడ్ లైన్స్ ఇస్తున్నారు..!  మరి పెళ్ళిచూపులు అనే కాన్సెప్ట్ లో అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చూసుకున్నాక కట్నాలు, కానుకలు ఓకే అయితేనే సంబంధాలు ఖాయం చేసుకుంటారు కదా.. మరి ఇందులో ఎంత లవ్ ఉందో, ఆ లవ్ ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందో, ఆస్తులు అంతస్తుల వివరాలు తెలిసినాక పుట్టించుకునే ప్రేమ, శారీరక ఆకర్షణలు మీ దృష్టిలో రియలిస్టిక్ లవ్ అనుకుంటా. అందుకే అర్జున్ రెడ్డి ప్రేమ, ముద్దు..మీ గోడలని బద్దలు కొట్టిన భయంలా  కనిపించి ఉండొచ్చు..

అరె.. మీ ఆయనతో వంట చేయిస్తున్నవేమో, బట్టలు ఉతికిస్తున్నవేమో… కామన్ గా వర్కింగ్ విమెన్ ని సహోద్యోగులు ఆటపట్టించే డైలాగ్ లు, జోకులు ఇవి..  వీటికి నవ్వుతూ ఛీ కాదు అనే సమాధానం..ఓ సిగ్గు.. అలవాటైన పద్దతి..  ఒకవేళ భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేసినా ఇంటి పనులు భార్యే చేయాలిగానీ.. పాపం అర్జున్  హీరోయిన్ బట్టలు దండెం మీది నుంచి తీసుకపోయి ప్యాక్ చేస్తాడు. ఉతికి ఆరేస్తాడు. ఇట్లా చేస్తే మగవాడి పరువేం కావాలీ..

దోస్తు తో నీకు ఉచ్ఛగుతా లేదుర అనిపించుకునే దమ్ము ఉందా తెలుగు హీరో కి.. ప్యాంటు లో ఐస్ ముక్కలేసుకున్నాడు, ఉచ్చ కూడా పోసుకున్నాడు..ఇది డ్రమాటికెల్ గా ఉందా.. సినిమాలో  అర్జున్ చేసిన  సర్జరీస్ రికార్డు లో ఎక్కడ ఒక్క ఫెయిల్యూర్ కూడా చూపించలేదు, ఆఖరికి తప్పక చేసి, వివాదాస్పదమైన కేసు లో కూడా.. ఓ మంచి డాక్టర్ అంటే పేషెంట్ దగ్గర నిజాయితీగా ఉండాలి.. నిజమే..సమాజం లో డాక్టర్ల తీరుని, పేషెంట్ల భద్రత, ఆరోగ్యం గురించి అంత బాధ్యత అనిపిస్తే ముందు అనవసరంగా చేస్తున్న సిజేరియన్ డెలివరీ లను, ముహూర్తాలు చూసి కడుపు కోసి బిడ్డలను బయటికి  తీయడాలను, డాక్టర్ల టార్గెట్ కోసం అమాయకులు గర్భసంచులను 30ఏళ్ళు దాటకుండానే తీసేయడాలను అడ్డుకోడానికి కాంపెయిన్ చేయండి..సమాజం హర్షిస్తుంది.

ప్రేమ అంటే ఏంటో తెలియని వాళ్లకి, అందులో ఉన్న పెయిన్ గురించి తెలుస్తుందనుకోవడం , సఫరింగ్ ఈజ్ పర్సనల్ అంటే అర్థం అవుతుందనుకోవడం మూ ర్ఖత్వం..

‘చదువుకున్నవాళ్ళు, జ్ఞానంతో ఉన్నవాళ్ళతోనే ఈ ప్రపంచానికి ప్రమాదం.. చదువు , తెలివి లేనివాళ్ళు పీకేదేమి లేదు’..ఎంత దురహంకారమయిన వ్యాఖ్య…

రైతు చదువుకున్నవాడు కాదు మరి వ్యవసాయమయితే చేయగలడు..మీరేం పీకగలరు? కనీసం వరి గడ్డి? ఇదేనా మీ పవిత్రత?.. తెలివి ఎవడి సొత్తు? .అసలు తెలివంటే ఏంటో మీ దృష్టిలో? మొన్న నంద్యాల ఎలెక్షన్ కాంపెయిన్ లో  మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులపై చేసిన కామెంట్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది మీ చదువుకున్న,తెలివిగల్ల బలుపు..

ఎదుటివాడిని కించపరిచి..మీ అహంకార పూరితమైన రివ్యూలు జనం మీదికి వదిలే మీ వల్లే సమాజానికి అసలైన ప్రమాదం పొంచి ఉంది, అంతేగాని అర్జున్ రెడ్డి వల్ల కాదు.. పక్క మీదికి చేరని ప్రేమ ప్రేమే కాదన్నాడంటూ.. ఇక చలాన్ని ఎందుకు ప్రస్తావించడం. మైదానం కథని ఎందుకు అడ్డం పెట్టుకోవడం.. ఎవరి నుండి ఎక్కడికి తప్పించుకోవడానికి… అసలే అర్జున్ రెడ్డి సినిమా నచ్చిన వాళ్ళలో మీరు గౌరవించే వాళ్ళూ..అభిమానించే వాళ్ళూ ఉన్నారు..మీకు ఈ సినిమా ఎందుకు నచ్చలేదో అందరికి అర్థమయేలా రాసినందుకు థాంక్స్.. ఫైనల్లీ ఇంకో విషయం..ఎవరినీ ట్యాగ్ చేయకండి.. అది అందరికీ మంచిది..ఆపరేషన్ చేయరా అంటే పోస్టుమార్టం చేసినట్టుంది  మైండ్ బ్లాంక్ రివ్యూ.అర్జున్ రెడ్డి హౌలాగాడయ్యుంటే డైరెక్టర్ సినిమా ఎందుకు తీస్తాడు? యూస్ కామన్ సెన్స్ అండ్ బీ ఛిల్..