న్యూ వేవ్ ‘అర్జున్ రెడ్డి’! - MicTv.in - Telugu News
mictv telugu

న్యూ వేవ్ ‘అర్జున్ రెడ్డి’!

August 25, 2017

చిత్రం :  అర్జున్ రెడ్డి

నిడివి :  186 నిముషాల 47 సెకన్లు

బేనర్ : భద్రకాళి పిక్చర్స్

పాటలు : అనంత శ్రీరామ్, శ్రేష్ఠ, రాంబాబు గోసాల

సంగీతం : రాధన్

సినిమాటోగ్రఫి : రాజు తోట

ఎడిటింగ్ : శశాంక్

నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగా

రచన – దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగా

నటులు : విజయ్ దేవరకొండ, శాలినీ పాండే, కాంచన, సంజయ స్వరూప్, కమల్ కామరాజు, గోపీనాథ్ భట్, జై శర్మ, అమిత్ శర్మ, ప్రియదర్శి, భువన్, అదితి మ్యకల్ తదితరులు

కొన్ని సినిమాలు విడుదల కాకముందు నుంచే హైప్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా యూత్ ని అట్రాక్ట్ చేస్తాయి. అయితే ఆ ఎక్సుపెక్టేషన్స్ ని సినిమా రీచ్ కాకపోతే రిజల్ట్స్ రివర్స్ అవుతాయి. ఆ ప్రమాదం ‘అర్జున్ రెడ్డి’కి లేదు. ఇది డెఫినిట్ గా రొటీన్ సినిమా కాదు. మన తెలుగు సినిమాల్లో కూడా మార్పు వొస్తోందని చెప్పడానికి.. రానున్న కాలంలో సినిమా రంగూ రుచీ మారనున్నదని చెప్పడానికి.. వాస్తవానికి దగ్గరగా సినిమా కళని తీసుకువెళ్ళడానికి సమయం దగ్గరపడిందని చెప్పడానికి.. ‘అర్జున్ రెడ్డి’ని చెప్పుకోవచ్చు!

కొత్తతరం దర్శకులు పాత కథలని కూడా కొత్తగా చెప్పడం చూస్తే అప్రిషియేట్ చెయ్యకుండా వుండలేం. మూస ఆలోచనలని మూసీ నదిలో కలిపేస్తూ సందీప్ రెడ్డి దర్శకుడిగా చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది. పైగా దర్శకుడే నిర్మాత కావడం వల్ల తను అనుకున్నట్టు తీయడానికి వున్న అన్ని అవకాశాలనూ వాడుకున్నాడు. నిర్మాత/దర్శకత్వ పర్యవేక్షణల అదుపు లేదని సినిమా లెంగ్త్ చూస్తేనే తెలుస్తోంది. పైగా తను యెంచుకున్న క్యారెక్టర్ కు విజయ్ దేవరకొండ జీవం పోశాడు. వెనకటికి ‘శివ’ సినిమా తెలుగు సినిమాని దారి మళ్ళించినట్టు ‘అర్జున్ రెడ్డి’ తనదైన ప్రభావం వేస్తాడని అంటే కాదనలేం. అయితే అది ‘అడల్ట్’ అంశాన్ని మాత్రమే అంటిపెట్టుకొనేదిగా స్వీకరించే ప్రమాదం కూడా లేకపోలేదు!

సరే- కథ కొస్తే- ‘అర్జున్ రెడ్డి’(విజయ్ దేవరకొండ) బ్రిలియంట్ మెడికో. సబ్జెక్ట్ లో టాపర్. అన్నిట్లో ది బెస్ట్. బట్ యాంగర్ మేనేజ్మెంటు లో కాలేజీ డీన్ చెప్పినట్టుగా పూర్. సున్నా. అలాంటి అదుపు చేసుకోలేని కోపంలో తోటి స్టూడెంటుని కొట్టి సస్పెండ్ అవుతాడు. సారీ లెటర్ యివ్వకూడదని కాలేజీ వదిలిపోవాలని అనుకుంటే, అప్పుడే కొత్తగా చేరిన ప్రీతి(శాలిని)ని చూసి తగ్గుతాడు. కాలేజీ కండిషన్స్ కు తలవొగ్గుతాడు. ఆ అమ్మాయిని యిష్టపడి ‘కేర్ టేకర్’గా లోకల్ గార్డెన్ గా వుంటాడు. ఆ పరిచయం అభిరుచుల మీదుగా కాక వయసు మోహాల మీదుగా వొక్కటి చేస్తుంది. అలాంటి వున్మాదికి నా కూతురిని యివ్వనని ప్రీతి తండ్రి చెపుతాడు. పరువు పేరుతో యింట్లోంచి అర్జున్ రెడ్డిని తండ్రి పంపేస్తాడు. ప్రీతిని మరిచిపోలేక వ్యసనాలకు లోనయిన అర్జున్ తిరిగి ప్రీతిని పొందాడా లేదా?, అతని వీక్ నెస్ ప్రేమని సాధించుకోవడంలో యెలా స్ట్రెంగ్త్ అయ్యింది అనేదే మిగతా సినిమా.

ఇది ప్రేమ కథ కాదు. ఒక మనిషి లైఫ్ లోని ఫేజ్ ని రిప్రజెంట్ చేసిన మూవీ. అందుకనే ప్రీతి లేకుండా ఆమె ప్రేమ చుట్టూ అర్జున్ రెడ్డి పరిభ్రమించడం కనిపిస్తుంది. ఎంత కోపం వున్నా కంట్రోల్ చేసుకోలేకున్నా వుమెన్ పట్ల తక్కువ భావం లేని అర్జున్, తను ప్రెగ్నెంట్ అయినా  ఆమె తన బిడ్డ అనుకోవడంలోనే ఆ క్యారెక్టర్ వుదాత్తత కనిపిస్తుంది. అలాగే సినిమాలో స్నేహితుడు ‘శివ’ (రాహుల్ ) పాత్రని మలచిన తీరు అభినందనీయం! అయితే అర్జున్ రెడ్డికి యిచ్చినంత  ప్రాధాన్యత కాకపోయినా ప్రీతికి కూడా- ఓ అమ్మాయిగా ఫేస్ చేసే అంశాల్ని సృజించాల్సినంత సృజించలేదు. అలాగే సినిమాలో మోతాదు మించి చూపించిన ముద్దులు మాత్రమే లవ్ కు ఎక్సుప్రెషన్ కాదని, వొక్కోసారి చేతి స్పర్శ కూడా సాంత్వన యిస్తుందన్న యెరుక లేకపోవడం లాంటివి మినహాయిస్తే సినిమా బావుంది.

విజయ్ అద్భుతంగా పాత్రలో లీనమయ్యాడు. రాహుల్ నటన బావుంది. శాలిని పాత్ర పరిమితుల్లో యిమిడిపోయింది. సీనియర్ నటి కాంచన కూడా తన సహజమైన నటన చూపించారు. పాటలు సినిమా మూడ్లోనే మి క్స్అయ్యాయి. నేపథ్య సంగీతం అలాగే కెమెరా పనితనం బావుంది. మాటలు సినిమాకు తగ్గట్టుగా వున్నాయి. మరో కొత్తదర్శకుడిగా సందీప్ రెడ్డి గుర్తుండిపోతాడు.

సినిమా కథలు చెప్పకు అనే మాటని చెరిపేసే ప్రయత్నం చేశాడు ‘అర్జున్ రెడ్డి’. మారబోతున్న తెలుగు సినిమాకి కొత్త సంతకం చేశాడు ‘అర్జున్ రెడ్డి’!

రేటింగ్: 3.25/5

జాసి