Armenia, Azerbaijan report 99 troops killed in border clash
mictv telugu

కొట్టుకు చస్తున్న అజర్‌బైజాన్, ఆర్మీనియా… 99 మంది మృతి

September 15, 2022

ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైన రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పటికీ ఆగలేదు. రష్యా ధాటికి ఉక్రెయిన్‌ గడ్డ ఎటూ చూసిన శవాల దిబ్బలతో హృదయవిదారకంగా మారిపోయింది. ఐతే అనుహ్యంగా ఈ నెలలో ఉక్రెయిన్‌ బలగాలు పుంజుకుంటూ రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి దక్కించుకుంటుంది. ఈ రెండు దేశాల యుద్ధం.. రెండో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తుండగానే.. మరో రెండు దేశాలు కూడా వాటిలానే కొట్టుకుచస్తున్నాయి. తాజాగా జరిగిన ఘర్షణలో 99 మంది సైనికులు మరణించారు.

రెండేళ్ల క్రితం మొదలైన ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అర్మేనియా, అజర్‌బైజాన్ అనే రెండు దేశాలు.. సరిహద్దులోని ఓ ప్రాంతం కోసం యుద్ధం చేస్తున్నాయి. అజర్‌బైజాన్‌లో భాగమైన నాగోర్నో-కరాబాఖ్‌పై దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతం తమదంటే తమదని ఇరుదేశాలు ఘర్షణకు దిగుతున్నాయి. 1994లో అక్కడ వేర్పాటువాద యుద్ధం ముగిసినప్పటి నుంచి ఈ ప్రాంతం అర్మేనియన్ దళాల నియంత్రణలో ఉంది. జూలై 19, 2020 న టర్కీలోని ఇస్తాంబుల్‌లో అజర్‌బైజాన్, అర్మేనియా మధ్య గొడవలు జరిగాయి. కాగా మరోసారి జరిగిన దాడుల్లో 99 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇరువైపులా దీర్ఘకాల ప్రత్యర్థుల మధ్య మరోసారి ఉద్రిక్తతను లేవనెత్తాయి. ఈ దాడుల్లో ఆర్మేనియాకు చెందిన 49 మంది, అజర్‌బైజాన్ కు చెందిన 50 మంది సైనికులు మృతి చెందారు. ఆర్మేనియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం అర్మేనియన్ భూభాగంలోని అనేక విభాగాల్లో అజర్‌బైజాన్ దళా డ్రోన్ దాడులకు తెగబడ్డాయి.