కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నివీర్ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 13 జిల్లాలకు సంబంధించి ఈ అగ్నివీర్ నియామక ర్యాలీని విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆగస్టు 14 నుంచి 31 వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎంపికలు ఉంటాయి. జులై 30 లోగా అభ్యర్ధులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. ఆగస్టు ఏడో తేదీ నుంచి అడ్మిట్ కార్డులు ఆన్లైన్ ద్వారా జారీ చేస్తారు. ఏపీలోని కేంద్రపాలిత ప్రాంతం యానాంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల అభ్యర్ధులు విశాఖలో జరిపే ర్యాలీకి అర్హులు. ఆర్మీ కాలింగ్ మొబైల్ యాప్ ద్వారా సందేహాలు తీర్చుకోవచ్చు. అంతేకాక, విశాఖ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయ ఫోన్ నెంబర్లు 0891 – 2756959, 0891 – 2754680 నెంబర్లకు ఫోన్ చేసి డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు.