జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అన్నీ స్థానాల్లో పోటీ చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ”వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. పోలీసు ఉద్యోగాల వయోపరిమితి సడలింపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. యువత బలమే జనసేనకు ప్రధాన ఆయుధం. తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థుల పాత్ర వర్ణించలేనిది” అని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా ఇటీవలే ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి, ఆర్థిక సాయం చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పర్యటన ముగించుకున్న పవన్ కల్యాణ్.. కోదాడకు బయలు దేరారు. గత ఏడాది ఆగస్టు 20న కోదాడలోని బక్కమంతులగూడెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి కడియం మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం నల్గొండలో పర్యటించనున్నారు. ఇప్పటికే జనసేన కార్యకర్తలు నల్గొండలో పవన్ కల్యాణ్ కటౌట్లతో, జనసేన పార్టీ జెండాలతో బైక్ ర్యాలీ తీశారు. మరోపక్క పవన్ కల్యాణ్ ప్రసంగంలోని పలు విషయాలను వివరిస్తూ.. రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరిట ఓ ప్రకటన విడుదల చేశారు.