అగ్నిపథ్ ఆందోళనలపై ఆర్మీ చీఫ్, కేంద్రమంత్రులు.. పాతికేళ్లలో పాతిక లక్షలు - Telugu News - Mic tv
mictv telugu

అగ్నిపథ్ ఆందోళనలపై ఆర్మీ చీఫ్, కేంద్రమంత్రులు.. పాతికేళ్లలో పాతిక లక్షలు

June 17, 2022

దేశవ్యాప్తంగా అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ పద్ధతిపై ఆందోళన చేస్తున్న నిరసనకారులు కొన్ని చోట్ల విధ్వంసానికి దిగారు. దీంతో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పందించారు. కరోనా వల్ల రెండేళ్లుగా నియామకాలు జరపలేదని, త్వరలో నియామక షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. ఆందోళనకారుల డిమాండ్ దృష్ట్యా 2022 నియామకాలకు సంబంధించి వయసు పరిమితిని 21 నుంచి 23 ఏళ్ళకు పెంచామని వెల్లడించారు. యువత ఆర్మీలో చేరి అగ్ని వీరులుగా అవకాశం దక్కించుకోవాలని సూచించారు. ఈ అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకాన్ని యువత అర్ధం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పోతుందని యువత ఆందోళన చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా విమర్శిస్తాయని, ఆ ముసుగులో హింసకు పాల్పడడం సరైంది కాదని హితవు పలికారు. ఈ స్కీంలో చేరిన వాళ్లకు 25 ఏళ్ల వయసులో 25 లక్షల రూపాయలు చేతిలో ఉంటాయని, దాంతో జీవితంలో సెటిల్ అయిపోవచ్చని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, భారత ఆర్మీ కలిసి పెట్టిన ఈ పథకం.. విదేశాల్లోని చాలా దేశాల్లో ఎప్పటినుంచో అమల్లో ఉందన్నారు.