Army jawan falls for honeytrap by Pak agents, leaks info
mictv telugu

పాక్ మహిళల వలపు వలలో చిక్కిన జవాన్.. ఆర్మీ సీక్రెట్స్ లీక్

July 27, 2022

పాకిస్థాన్ ఏజెంట్ల హనీట్రాప్‌లో చిక్కుకున్న ఓ ఆర్మీ జవాన్.. భారతదేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేశాడు. సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేయడంతో ఆర్మీ ఉద్యోగి శాంతిమే రాణా (24)ను అరెస్ట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని బగుండా జిల్లా కంచన్‌పుర్ గ్రామానికి చెందిన శాంతిమే రాణా.. జైపూర్‌లోని ఆర్టెరీ యూనిట్‌లో విధులు నిర్వరిస్తున్నారు.

సోషల్ మీడియలో శాంతిమే రాణాకి పరిచయమైన పాకిస్థాన్ ఏజెంట్లు గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత, నిషాలు అతడిని మాయమాటల్లో ముంచారు. వలపు వల విసిరి అతని నంబర్ తీసుకున్నారు. ఆ తర్వాత రాణాతో వాట్సాప్ ద్వారా చాట్ చేసేవారు. తను పూర్తిగా వాళ్లని నమ్మాడని నిర్థారించుకున్న తర్వాత ఇద్దరూ సైనిక రహస్యాలు తెలుసుకోవడం మొదలుపెట్టారు. దీని కోసం రాణాకి కొంత డబ్బులు కూడా ఇచ్చినట్లు రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.

శాంతిమే రాణా 2018లో ఆర్మీలో చేరాడు. సోషల్ మీడియా ద్వారా అతని డీటైల్స్, ప్రొఫైల్ చెక్ చేసిన ఏజెంట్లు ఒకరు తనను మిలటరీ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసిన మహిళగా పరిచయం చేసుకోగా.. ఇంకొకరు మిలటరీలోని నర్సింగ్ విభాగంలో పనిచేస్తానని నమ్మించింది. ఆ తర్వాత రాణా.. తన రెజిమెంట్‌కు సంబంధించిన రహస్య సమాచారాలతో పాటు, సైనికులు వ్యాయామాలు చేస్తున్న వీడియోలు కూడా వాళ్లకి పంపాడని రాజస్థాన్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేశ్ మిశ్రా మీడియాకు వెల్లడించారు. ఈ నెల 25న రాణాని అరెస్ట్ చేశామని.. ప్రస్తుతం అతను తమ అదుపులో ఉన్నట్లు ఆయన వివరించారు.