ట్రక్ డ్రైవర్ పై ఆర్మీ జవాన్ కాల్పులు.. పరిస్థితి విషమం - Telugu News - Mic tv
mictv telugu

ట్రక్ డ్రైవర్ పై ఆర్మీ జవాన్ కాల్పులు.. పరిస్థితి విషమం

March 6, 2023

Army jawan shoots truck Driver for filming him with girlfriend

 

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఆర్మీ సైనికుడు తన సర్వీస్ రివాల్వర్ తో ఓ ట్రక్కు డ్రైవర్ పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన డైవర్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సైనికుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

వివరాల్లోకెళ్తే.. వికాస్ తివారీ(24) అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం పంజాబ్‌లోని పాటియాలాలోని సెకండ్ కార్ప్స్ బెటాలియన్‌లో నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవులపై నిందితుడు స్వగ్రామం రీవాకు వచ్చాడు. ఈ క్రమంలో తన ప్రియురాలితో కలిసి శనివారం మధ్యాహ్నం గంగేవ్ సమీపంలోని ఓ గుడికి వెళ్లాడు. ఆ తర్వాత దగ్గరలోని ఖాళీ ప్రదేశంలో ఆమెతో ఒంటరిగా ఉన్న సమయంలో పక్క గ్రామానికి చెందిన బ్రజేంద్ర కోరి అలియాస్ భయ్యాంబ(30) అక్కడికి చేరుకున్నాడు. వృత్తిరీత్యా ట్రక్కు డ్రైవర్ అయిన అతను.. వారిద్దరిని అలా చూశాక.. వారికి తెలియకుండా సీక్రెట్ గా వారి ఫోటోలు, వీడియోలను తీశాడు.

 

మరో వ్యక్తి ద్వారా ఈ విషయం జవాన్‌కు తెలియడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే తన ప్రియురాలిని తన వెంట పెట్టుకుని .. స్కూటీతో ట్రక్కును వెంబడించడం ప్రారంభించాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హైవే-30లోని లక్ష్మణ్ దాబా సమీపంలో ట్రక్కును ఆపాడు. డ్రైవర్‌ను కిందకు దిగమని అడగ్గా.. దిగలేదని, అవతలి వైపు నుంచి లారీ ఎక్కి వీడియో డిలీట్ చేయమని అన్నాడు. అందుకు డ్రైవర్ నిరాకరించడంతో ఆవేశానికి గురైన సైనికుడు తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ తో తనపై రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఈ బుల్లెట్‌లలో ఒకటి మిస్ కాగా, రెండో బుల్లెట్ బ్రజేంద్ర ఎడమ కంటికి తగిలింది. ఆ తర్వాత వికాస్ తివారీ పారిపోయాడు. బాధితుడిని జిల్లాలోని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీకి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. తివారీపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని రేవా పోలీసు సూపరింటెండెంట్ నవనీత్ భాసిన్ తెలిపారు.