Army jawan's family members start death march
mictv telugu

ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులు అమరణ దీక్ష..

September 30, 2022

Army jawan's family members start death march

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం మూలగానివారిపాలెంకు చెందిన ఓ ఆర్మీ జవాన్ కుటుంబం తమ బిడ్డ మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ, అమరణ నిరాహార దీక్షకు దిగిన సంఘటన కలకలం రేపింది. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పోలీసులు మాత్రం స్పందించటం లేదని, ఈసారి న్యాయం జరిగేవరకు తమ ప్రాణాలు పోయిన సరే దీక్ష చేపడుతామని, పోలీసు స్టేషన్ ముందు దీక్షకు దిగారు. తమ కొడుకు మృతి చెంది 40 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఆగష్టు 21వ తేదిన మూలగానివారిపాలెం వాసి అయిన సూర్య ప్రకాష్ రెడ్డి జమ్మూలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తూ, తన గదిలో ఊరేసుకోని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అందుకు ప్రధాన కారణం.. సూర్య ప్రకాష్ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి తనను సూర్యప్రకాష్ వేధిస్తున్నాడని చినగంజాం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెందిన జవాన్..ఆగస్టు 21న జమ్మూలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అయితే, జవాన్ సూర్యప్రకాష్ రెడ్డి చనిపోయి 40 రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు తమ బిడ్డ మృతికి కారకులైన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతూ, అమరణ నిరాహార దీక్షకు దిగారు. న్యాయం చేస్తారా? లేదా? చెప్పండి అంటూ డిమాండ్ చేశారు. తమ కొడుకు మృతికి పరోక్షంగా కారకులైన వారిని అరెస్ట్ చేయాలని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. మరి పోలీసులు ఏం చేస్తారో వేచి చూడాలి. వారికి న్యాయం చేస్తారా? లేక ఉన్నతాధికారులకు అప్పగిస్తారా అనేది ఉత్కంఠను రేపుతోంది.