పాక్ మిడతల పని పట్టడానికి చైనా బాతుల ఆర్మీ - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ మిడతల పని పట్టడానికి చైనా బాతుల ఆర్మీ

February 27, 2020

Chinese Ducks

పాకిస్తాన్‌కు చైనా దేశం బాతు సాయాన్ని ప్రకటించింది. మిడతలతో సతమతం అవుతున్న పాక్‌కు సాయం చేసేందుకు లక్ష బాతుల ‘ఆర్మీ’ని పంపించనున్నట్లు చైనా స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. జిజియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి ఈ బాతులను పాక్‌కు పంపాలని చైనా నిపుణులు సలహా ఇచ్చారని సదరు కథనాలు పేర్కొన్నాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా గతేడాది నుంచి పాక్‌లో మిడతలు దండులా పాక్ మీద యుద్ధానికి దిగినంత పనే చేశాయి. లక్షల సంఖ్యలో మిడతలు పంటలపై దాడి చేసి పంటను సర్వనాశనం చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పాక్‌ ప్రభుత్వం.. ఆ మధ్య అత్యవసర స్థితి ప్రకటించింది. ఈ సమస్య నుంచి రైతులను కాపాడేలా సత్వర ప్రణాళిక కోసం రూ.730 కోట్లు కేటాయించింది.

మరోవైపు గత కొంత కాలంగా చైనా ఇదే పద్ధతిన బాతులనే ఆయుధంగా చేసుకుని మిడతలను సంహారం చేస్తోంది. బాతులతో ఖర్చు తక్కువ.. పైగా పర్యావరణం కూడా దెబ్బ తినకుండా ఉంటుంది. దీంతో గత రెండు దశాబ్దాలుగా జిజియాంగ్‌ ప్రావిన్స్‌లో పెద్ద సంఖ్యలో బాతులను పెంచుతోంది. వీటి నిర్వహణ కూడా సులభం అవడంతో బాతుల పెంపకానికి పూనుకుంది. ఒక కోడి రోజుకు కేవలం 70 మిడతలు తింటే.. బాతు 200లకు పైగా మిడతలను తినగలుగుతుందని జిజియాంగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ టెక్నాలజీ రీసర్చర్‌‌ లు లిజి అన్నారు. కాగా, భారత్‌లోని గుజరాత్‌ రాష్ట్రంలో కూడా మిడతలు పంటలను నాశనం చేస్తున్నాయి.