జమ్మూకశ్మీరులో విషాదం చోటుచేసుకుంది. లోయలో పడి ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు విడిచారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో కుప్వారా జిల్లాలోని మచల్ సెక్టార్లోని ఎల్ఓసి సమీపంలోని ఫార్వర్డ్ ఏరియాలో ముగ్గురు జవాన్లు లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు మరణించారు.
ఈ ఘటన నిన్న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గత కొద్ది రోజులుగా మంచు కురుస్తోంది. మంచు పెళ్లలు విరిగి పడడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.ముగ్గురి మృత దేహాలను వెలికితీసినట్లు స్పష్టం చేశారు. ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు.పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.