రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్రం ఇటీవల అగ్నిపథ్ అనే కొత్త పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే నేవీ కింద దరఖాస్తులు ఆహ్వానించగా, పెద్ద సంఖ్యలో స్పందన వచ్చింది. ముఖ్యంగా మహిళల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు ఆర్మీ వంతు వచ్చింది. అక్టోబర్ 15 నుంచి 31వ తేదీ వరకు రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు సికింద్రాబాద్ ఆర్మీ అధికారులు తెలిపారు. అందుకోసం నేటి నుంచి సెప్టెంబరు 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్ధులు www.joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలన్నారు. అక్టోబరు 1వ తేదీ నాటికి వయసు 23 ఏళ్లు ఉన్నవారే అర్హులని స్పష్టం చేశారు. విద్యార్హతల పరంగా చూస్తే అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగంలో పదో తరగతి పాసై ఉండాలి. ట్రేడ్స్మెన్కు ఎనిమిదో తరగతి అర్హతాగా నిర్ణయించామని వెల్లడించారు. సూర్యాపేటలోని శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.