అర్ణబ్ గోస్వామి అరెస్ట్.. డిజైనర్ ఆత్మహత్య కేసులో  - MicTv.in - Telugu News
mictv telugu

అర్ణబ్ గోస్వామి అరెస్ట్.. డిజైనర్ ఆత్మహత్య కేసులో 

November 4, 2020

వివాదాల జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి చిక్కుల్లో పడ్డారు. ఓ డిజైనర్ హత్య కేసులో ముంబై పోలీసులు ఆయనను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్‌గా పనిచేస్తున్న అర్ణబ్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. టీఆర్పీ రేట్లను అక్రమంగా పెంచినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.ముంబైకి చెందిన అన్వయ్ నాయక్ అనే ఇంటీరియర్ డిజైనర్, అతని తల్లి కుముద్ మృతి కేసులో అర్ణబ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

2018 మే మాసంలో అన్వయ్ నాయక్, అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్వయ్ సూసైడ్ నోట్‌లో అర్ణబ్ గోస్వామి పేరు కనిపించింది. అర్ణబ్, ఫెరోజ్ షెయిక్, నితీశ్ సర్దా అనే ముగ్గురు తనకు రూ. 5.40 కోట్లు బాకీ ఉన్నారని, ఆ డబ్బును ఇవ్వకపోవడంతో ఆర్థిక కష్టాలకు గురై చనిపోతున్నానని అందులో ఉంది. అయితే పక్కా ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు మూసేశారు. ఇటీవల  మహారాష్ట్రలోని శివసేన సర్కారుకు, బీజేపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో నాయక్ కూతురు తనకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో మళ్లీ దర్యాప్తుకు ఆదేశించారు. కాగా అర్ణబ్ అరెస్ట్ అక్రమమని రిపబ్లిక్ టీవీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు ఆయనపై దాడి కూడా చేశారని తెలిపింది. ‘ఆయనను చొక్కాపట్టుకుని లాక్కెళ్లారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. ప్రజలందరూ దీన్ని ఖండించాలి’ అని కోరింది.