30 మంది ఎంపీలకు కరోనా.. ఇంకేం పార్లమెంటు! - MicTv.in - Telugu News
mictv telugu

30 మంది ఎంపీలకు కరోనా.. ఇంకేం పార్లమెంటు!

September 14, 2020

Around 30 MPs test positive for Covid-19: Sources

హోం మంత్రి అమిత్ షా సహా ఇప్పటివరకు ఏడుగురు కేంద్రమంత్రులు, 25 మంది ఎంపీలకు కరోనా సోకింది. వివిధ రాష్ట్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు కూడా కరోనాకు టార్గెట్ అవుతున్నారు. పలువురు చనిపోతున్నారు కూడా. తాజాగా ఒకేసారి 30 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో పార్లమెంటులో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజే ఈ ఆందోళనకర విషయం వెలుగులోకి రావడం కలకలం రేపింది. సమావేశాలకు ముందు పార్లమెంట్‌ ఆవరణలో లోక్‌‌సభ, రాజ్యసభ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 30 మంది ఎంపీలు, 50 మందికి పైగా పార్లమెంట్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే కరోనా వైరస్ సోకిన లోక్‌సభ సభ్యుల్లో అధికార బీజేపీకి చెందిన వారే ఎక్కువమంది ఉన్నారు. ఇక వైసీపీకి చెందిన ఇద్దరు, శివసేన, డీఎంకే, ఆర్‌ఎల్‌పీ పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీకి పాజిటివ్‌గా తేలింది.

వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీల్లో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవి ఉన్నారు. బీజేపీ ఎంపీల్లో అనంత్‌ కుమార్‌ హెగ్డే, మీనాక్షీ లేఖి తదితరులు ఉన్నారు. కాగా, పార్లమెంట్‌ సమావేశాల కారణంగా అధికారులు మరిన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ్యులు అందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని లోక్‌ సభ, రాజ్యసభ సచివాలయం నిబంధనలు విధించింది. పార్లమెంట్‌ రిసెప్షన్‌ వద్ద ఉభయ సభల సభ్యులు, అధికారులు, మీడియా సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు. ఇదిలావుండగా ఎంపీలకు  నిర్వహించిన పరీక్షల్లో ఇంతమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎలాంటి లక్షణాలు బయట పడకుండానే పాజిటివ్‌గా తేలడంతో సామాన్యుల్లో కరోనా గుబులు మరింత రెట్టింపు అయింది.