భళా విద్యార్థుల్లారా.. స్కూల్ ఎగ్గొట్టి రోడ్డును బాగుచేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

భళా విద్యార్థుల్లారా.. స్కూల్ ఎగ్గొట్టి రోడ్డును బాగుచేశారు..

January 14, 2020

jghkggh

ఇంటి దగ్గర స్నేహితులతో ఆడుకోవడానికో, ఇంట్లో అమ్మానాన్నలకు తెలియకుండా సినిమా, షికార్లకు వెళ్లాలనో, ఫంక్షన్‌లకు వెళ్లడానికో విద్యార్థులు పాఠశాలకు డుమ్మా కొడతారు. కానీ, ఏకంగా 85 మంది విద్యార్థులు ఒకేరోజు స్కూలుకు బంక్ కొట్టారు. ఒకే గ్రామానికి చెందిన అంతమంది విద్యార్థులు ఒకేరోజు స్కూలుకు ఎందుకు వెళ్లలేదంటే.. 

వారు పాఠశాలకు వెళ్లాలంటే బస్సు రావాలి, బస్సు రావాలంటే రోడ్డు బాగుండాలి.. అందుకే రోడ్డు బాగు చేసేందుకు ఆ విద్యార్థులంతా స్కూల్‌ మానేసి శ్రమించారు. తమ చిట్టి చిట్టి చేతులతో రోడ్డు బాగు చేసుకోవడానికి శ్రమించారు. 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా ధమన్‌గావ్‌ రాజూర్‌ గ్రామంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 18 కిలోమీటర్ల రహదారి నిర్మించేందుకు గతేడాది ముఖ్యమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ, స్థానిక అధికారులు ఆ రోడ్డును పూర్తిచేయకుండా మధ్యలోనే వదిలేశారు. దీంతో రోడ్డు మార్గం అత్యంత అధ్వన్నంగా తయారైంది. ఆ రోడ్డుపై రావడానికి బస్సులు బెదురుతున్నాయి. ఈ నేపథ్యంలో బద్నాపూర్‌ డిపో నుంచి ఆ గ్రామానికి వచ్చే బస్సు సర్వీసును గతేడాది డిసెంబరు నుంచి నిలిపివేశారు.

గ్రామానికి చెందిన చాలా మంది పిల్లలు సమీపంలోని దభడీ గ్రామంలో ఉండే పాఠశాలలో చదువుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే బస్సు ఎక్కాల్సిందే. అయితే గత నెల రోజులకు పైగా బస్సు ఆ ఊరికి రాకపోవడంతో విద్యార్థులు 10 కిలోమీటర్లు కాలి నడకన వెళ్లాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులంతా ఓ నిర్ణయానికి వచ్చారు.

రోడ్డు కోసం అధికారులను కలిసే కన్నా తామే నడుం కడుదామని తయారయ్యారు. అందరూ కలిసి రోడ్డు బాగుచేసేందుకు పూనుకున్నారు. ఈ నెల 10న వీరంతా స్కూల్‌ మానేసి రోడ్డుపై కిలోమీటర మేర ఉండిపోయిన రాళ్లను తొలగించారు. దీంతో రోడ్డు కాస్త నయం అయింది. త్వరలోనే వారి ఊరికి మళ్లీ బస్సు రానుంది. తమ భవిష్యత్తుకు తామే వారధులం అన్నట్టు ఈ విద్యార్థులు చేసిన పని స్థానికంగా చాలామందిని కదిలించింది.