అర్పిత్.. నువ్వు కలకాలం ఇన్‌స్పెక్టర్‌గా ఉండాలి! - MicTv.in - Telugu News
mictv telugu

అర్పిత్.. నువ్వు కలకాలం ఇన్‌స్పెక్టర్‌గా ఉండాలి!

March 23, 2018

అర్పిత్ మండల్.. ఏడేళ్ల చిన్నారి. జీవితం ఇంకా మొదలే కాలేదు. అయితే కేన్సర్ మహమ్మారి దాడి చేసి నెమ్మదిగా కబళిస్తోంది. చాలామంది పిల్లలకు పెద్దపెద్ద కోరికలు ఉన్నట్లే అర్పిత్‌కూ ఒక కోరిక ఉంది. తాను పెద్దయితే పోలీస్ ఇన్‌స్పెక్టర్ కావాలని. అయితే కేన్సర్ వల్ల అది సాధ్యం కాదేమోనని దిగులు కూడా పట్టుకుంది. ఈ విషయం ముంబై పోలీసులకు తెలిసింది. వారు అర్పిత్‌ను కలుసుకున్నారు.

ఆ చిన్నారి కోరికను నెరవేర్చడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇటీవల అతణ్ని ములుంద్‌లోని తమ కార్యాలయానికి తీసుకెళ్లి, పోలీస్ ఇన్ స్పెక్టర్ దుస్తులు తొడిగారు. తర్వాత ఇన్‌స్పెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సంబరం గుర్తుండిపోయేలా అతనితో కేక్ కట్ చేయించి, తినిపించారు. ఈ ఫొటోలను తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని చూసిన నెటిజన్లు.. పోలీసులు భేష్, ఇన్‌స్పెక్టర్ అర్పిత్ సాబ్.. సెల్యూట్ అని అభినందిస్తున్నారు. అర్పిత్ కేన్సర్ నుంచి తర్వగా కోలుకుని, ఒక రోజుకాకుండా జీవితాంతం ఇన్ స్పెక్టర్‌గానే ఉండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నారు.