ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో శృతిమించిన కంటెంట్ రాజ్యమేలుతోందనే విమర్శలు వినబడుతున్నాయి. దానిమీద సెన్సార్ నిబంధనలు లేకపోవడంతో ఎవరికి తోచింది వారు చేస్తున్నారని, బూతులు, రొమాన్స్‌తో రెచ్చిపోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ వెబ్‌సిరీస్ ‘ఆశ్రమ్’పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆశ్రమ్‌లో హిందూ మఠాలను కించపరిచినట్లుగా ముస్లిం మదర్సాలను కూడా చిత్రించగలరా అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే ప్రకాశ్ ఝా వంటి సినీ దర్శకులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #Arrest_Prakash_Jha అనే హ్యాష్‌ట్యాగ్‌ను నెటిజన్లు ట్విటర్లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై 50 వేల వరకు ట్వీట్లు పోస్ట్ అయ్యాయి.
దేశంలో హిందూత్వాన్ని దెబ్బతీసి, ఇతర మతాలతో సంబంధాలను చెడగొట్టి దేశ ఐక్యతను కాలరాయడానికే ఇలాంటి వెబ్‌సిరీస్‌లు తీస్తున్నారని అంటున్నారు. ఇది బాలీవుడ్ జీహాద్‌తో సమానమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వెబ్‌సిరీస్ తీసిన ప్రకాశ్ ఝాపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ఇస్లాం మత ప్రవక్తపై తీసిన ‘మహ్మద్.. ది మెసెంజర్ ఆఫ్ గాడ్’ సినిమానే నిషేధించారు. కానీ, హిందూ మతాన్ని కించపరిచేలా ఉన్న ఆశ్రమ్ వంటి సినిమాలను మాత్రం ఎందుకు నిషేధించడంలేదు?’ అని ప్రశ్నిస్తున్నారు.