షమీ అరెస్టుకు కోర్టు ఆదేశాలు జారీ
టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి అలిపొరే కోర్టు షాక్ ఇచ్చింది. గతంలో హసీన్ జహాన్ వేసిన గృహహింస కేసు నేపథ్యంలో షమీ, అతని సోదరుడు హసిద్ అహ్మద్‌కు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వీరిద్దరు 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. షమీ ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. సిరీస్ ముగిసి భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
గత ఏడాది మార్చిలో షమీ భార్య హసీన్ అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే. వారి అక్రమ సంబంధానికి సంబంధించిన ఆధారాలు ఇవేనని ఆమె కొన్ని వాట్సాప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. షమీ, అతని కుటుంబ సభ్యులు తనపై హత్యాయత్నం చేశారని, లైంగికంగా వేధించారని ఆరోపించింది. అంతేకాకుండా షమీ పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేశాడని ఆమె ఆరోపించింది. దీంతో బీసీసీఐ షమీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణలో షమీ నిర్ధోషి అని తేలింది. దీంతో అతనికి కాంట్రాక్ట్‌ను ఇచ్చి.. జట్టులో చోటు కల్పించింది. కాగా, ప్రస్తుతం షమీ వెస్టిండీస్ పర్యటనలో వున్నాడు.