శ్రీలంకతో గురువారం జరిగిన రెండో టీ20లో టీం ఇండియా పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ మొత్తం 7 నోబాల్స్ వేయగా అందులో అర్షదీప్ ఒక్కడే ఐదు బంతులను గీత దాటి విసిరాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అర్షదీప్ హ్యాట్రిక్ నోబాల్స్ వేశాడు. తర్వాత 19 ఓవర్లో మరోసారి అర్షదీప్ వేసిన వరుస రెండు బంతులను అంపైర్లు నో బాల్స్‌గా ప్రకటించారు. మొత్తం అర్షదీప్ వేసిన ఐదు నోబాల్స్ నుంచి శ్రీలంక 23 పరుగులు పిండుకుంది. అర్ష్‌దీప్ కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 37 పరుగులు ఇచ్చాడు.
చివరికి టీ20 ఫార్మెట్లో అత్యధిక నోబాల్స్(14) వేసిన బౌలర్‌గా చెత్తరికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఐదు నోబాల్స్ వేసిన రెండో బౌలర్ కూడా అర్షదీప్ కావడం విశేషం.అతని కంటే ముందు న్యూజిలాండ్ క్రికెటర్ హమీష్ రూథర్‌ఫోర్డ్ (5 నోబాల్స్) ఉన్నాడు.
ఒక్క నోబాల్ వేయని భువనేశ్వర్
టీ 20 క్రికెట్లో భారత్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంతవరకు ఒక్క నోబాల్ వేయలేదు. ఇప్పటివరకు టీ20లో 298.3 ఓవర్లు వేసిన భువ్వనేశ్వర్ ఒక్కసారికూడా గీత దాటలేదు. అర్షదీప్ అత్యంత చెత్త రికార్డు ఉంటే..భువనేశ్వర్ ఓ మంచి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
నోబాల్స్తోనే ఓటమి
భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20లో భారత్ ఓడింది. చివరి వరకు ఉత్కంఠ బరితంగా సాగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శ్రీలంక నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆటగాళ్లు ఆందుకోలేకపోయారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి విజయం ముంగిట నిలిచిపోయారు. అక్షర్ పటేల్(31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65), సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) రాణించినా మిగిలిన బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో టీం ఇండియాకు ఓటమి తప్పలేదు.మ్యాచ్‌లో భారత్ బౌలర్లు వేసిన నో బాల్స్ కొంపముంచాయి. 7 నోబాల్స్ వేసిన బౌలర్లు వీటిద్వారా అదనంగా 34 పరుగులు సమర్పించుకున్నారు.