దక్షిణాది సినీ ప్రియులకు ప్రముఖ మలయాళ నటి నిత్యమినన్ అంటే తెలియని వారుండరు. ఆమె నటించిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల ద్వారా సినీ ప్రియుల్లో ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అయితే, నిత్యమినన్ పెళ్లి గురించి ఈ మధ్య కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, టీవీల్లో, న్యూస్ పేపర్లలో.. ఆమె ఓ మలయాళ నటుడితో ప్రేమలో ఉందని, వారి ప్రేమను ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెగ ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఆ వార్తలపై నిత్యమినన్ స్పందిస్తూ.. అవన్నీ అవాస్తవాలు అన్నీ, తప్పుడు వార్తలు రాయొద్దని వేడుకున్నారు. అయినా, కూడా కొన్ని టీవీ ఛానెళ్లు, పత్రికలు కథనాలు మీద కథనాలు రాస్తూనే ఉన్నారు. దీంతో మరోసారి నిత్యమినన్ ఓ వీడియో రూపంలో తీవ్రంగా స్పందించారు. ఎవరో ఓ వ్యక్తి ఊహించి రాసిన ఆర్టికల్‌ను ఆధారంగా చేసుకొని, కొన్ని టీవీ ఛానెళ్లు, పత్రికలు తెగ ప్రచారం చేస్తున్నాయి అని మండిపడ్డారు.
ఆ వీడియోలో నిత్యమినన్ మాట్లాడుతూ..”పెళ్లి గురించి ప్రస్తుతానికైతే ఎలాంటి ఆలోచన, ప్రణాళిక లేదు. ఎవరో ఓ వ్యక్తి ఊహించుకుని ఓ ఆర్టికల్ రాస్తే, ఎలాంటి ఆధారాల్లేకుండా ఆ వార్తను అందరూ ప్రచారం చేస్తున్నారు. రోబోలా మెకానికల్‌గా ఉండటం నాకు ఇష్టం ఉండదు. అందుకే, అప్పుడప్పుడు సినిమాలకు బ్రేక్ ఇస్తుంటాను. నేను నటించిన ఐదారు సినిమాలు త్వరలోనే విడుదలకాబోతున్నాయి. ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నాను’. అని ఆమె అన్నారు.