Home > Flash News > రాస్కోరా సాంబా……..మంత్రిగారి హితబోధ

రాస్కోరా సాంబా……..మంత్రిగారి హితబోధ

కేంద్ర పైసల మంత్రి అరుణ్ జైట్లీ సారు ఓ గో……..ప్ప మాటన్నారు. ప్రజలు పన్నులు కట్టాల్సిందే…. అని తెగేసి చెప్పిండు. మంచిదే సారు. ఈ బూమ్మీదికొచ్చి… కన్ను తెర్సి….. మూసే వరకు ట్యాక్స్ కట్టకుండా పూట గడుస్తదా.గీ ముచ్చట జనాలకు బాగా అర్థం అయింది సారు. కూలీ నాలీ జనాలు పన్నులు కట్టకుండా ఏమీ కొనలేరు… తినలేరు..

ట్యాక్స్ లు కట్టకుంటే ప్రభుత్వం నడిపేదెట్లా అని కూడా సెలవిస్తున్నారు జైట్లీ గారు. నిజమే సారు… ప్రభుత్వం నడ్వాల్నంటే.. ట్యాక్సులు కట్టాల్సిందే.. ఎంత మంది ట్యాక్సు లు కడ్తున్నారో.. ఎంత మంది ఎగ గొడుతున్నారో అంతా మీకు ఏర్కైన ముచ్చట్నే కదా. మీతాన అధికారులున్నారు. దాని కోసం ఓ డిపార్ట్ మెంటే ఉంది. వాళ్ల తానా లెక్కా పత్రం…అన్నీ ఉండాలీ కదా సారు. ఇవేవీ లేకుండానే… కథ నడుస్తుంద సారు..

ట్యాక్సులు కట్టని కంపిన్లను గుర్తు వట్టి.. గుంజుండ్రి పన్ను. జనాలు వద్దన్నారా ఏందీ.. అయినా 134 కోట్ల మందున్న ఈ దేశంల ఎంత మంది జేబులు నిండుగా ఉన్నవి సారు. దంచిందానికి బుక్కందానికి సరిపోయిందన్నట్లుంది సంపాదన. మరి కొత్తగ ట్యాక్స్ లు కట్టాల్సిందే అని సెలవిస్తే ఎట్ల సారు.

పవర్ల కొచ్చిన కొత్తల మీరే అంటిరి నల్లధనం తెస్తం… వొంద రోజుల్ల నకిలీ సాంతం కడిగేస్తమని చెప్తిరి. నల్లధనం లెక్కా పత్రాల ముచ్చటేందో జనాలకు తెల్వకుండనే పాయే. పెద్ద నోట్లు రద్దు చేస్తిరి….. దీంతోని దరిద్ర్యం పత్తా లేకుండా పోతదంటిరి… నల్లధనం నోట్ల కట్టలు కంటికి కన్పియకుండా అయితదని సెలవిస్తిరి…… మూలకో… అటకల మీదనో… తంతెల కిందనో మీదనో యాన్నో ఓతాన ఉన్న నోట్ల కట్టల సంగతేమో గని…. ఇండ్లల్ల ఉన్న జనాలు రోడ్ల మీద కొచ్చిండ్రు…

మీరు చెప్పినవన్నీ జనాలు చేస్తనే ఉన్నరు. అయినా మీరు మల్లా ట్యాక్స్ లు కట్టాలని జనాలకు హితబోధ చేస్తున్నారు. ఇన్నొద్దులు మేం ట్యాక్సులు కట్టకుండనే సర్కార్లు నడ్సుస్తున్నయా.

కొన్ని ట్యాక్సుల పేర్లు పల్కాల్నంటే అస్సలు నోరే తిర్గదు…. సర్వీసు ట్యాక్సులు… సెస్సులు… పిస్సులు…ఓ 60 నుండి 70 దాంక జనాలు కడ్తనే ఉన్నరు. ఇన్ని ట్యాక్సులు కట్టి కాటగలుస్తరని… తక్లీఫ్ లేకుండా జీఎస్టీ అని ఒకే పేరుతో ట్యాక్స్ అంటరి.. అదీ కడ్తం… అయినా కూడా జనాలూ మీరు ట్యాక్స్ లు కట్టాల్సిందే అంటే ఎట్ల సారు.

మంత్రి గారు….. ట్యాక్స్ లు ఎగ్గొట్టేటోళ్లు,బ్యాంకులను ముంచేటోళ్లు ఎవరో మీకు తెల్సు గద. ముందుగాల వాళ్లతాన్నుండి పన్నులు గుంజండ్రి…ఇంకా ఎవరన్నా మిగిలిపోతే… ఆధార్ కార్డు… పాన్ కార్డు… రేషన్ కార్డు… ఓటరు కార్డు…. బ్యాంక్ ఖాతాల ఇవరాలన్నీ మీతాన్నే ఉన్నవి. మిమ్ములను కాదని ఎట్లా ట్యాక్సు లు ఎగ్గొడ్తరు.

ఓ మంచి మాట: ప్రభుత్వం అంటేనే ట్యాక్సులు ఏయనీకే అనే అభిప్రాయం జనాలకు రానీయకుండ్రీ సారు.

Updated : 2 July 2017 3:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top