ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు కొనసాగుతోంది. కేసుతో లింకులు ఉన్నవారందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఎప్పుడు ఎవరికీ నోటీసులు వెళ్తాయో..ఎవరు అరెస్ట్ అవుతారో అని ఉత్కంఠ నెలకొంది. తాజాగా మరో లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న పారిశ్రామిక వేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. దీంతో ఈనెల 16 వరకు పిళ్లై ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. అదే రోజు కవితను మరోసారి ఈడీ విచారించనుంది. 15వ తేదీన కవిత ఆడిటర్ బుచ్చిబాబును విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. బుచ్చిబాబును, పిళ్లైను కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కవిత విచారణకు ముందు ఒక రోజు ముందు తాను గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలంటూ.. అరుణ్ పిళ్లై కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బలమైన వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు పిళ్లై తన స్టేట్మెంట్ మార్చుకున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రామచంద్ర పిళ్లైతో కలిపి ఇప్పటి వరకూ 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. అరుణ్ రామచంద్ర పిళ్ళైను ఢిల్లీ మద్యంకుంభకోణంలో ఈడీ నిందితుడిగా పేర్కొంది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన మీదట దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.