అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు పైలెట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒకరిని హైదరాబాద్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నర్ ఉప్పల వినయ భానురెడ్డి(37)గా గుర్తించారు. మరొకరు మేజర్ జయంత్. వీరు ప్రయాణించిన చీతా హెలికాప్టర్ గురువారం సెంగే నుంచి మిస్సమరికి వెళ్తూ బొమ్దిలా ప్రాంతంలో కుప్పకూలింది. రాడార్ నుంచి సంబంధాలు తెగిపోవడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. సశస్త్ర సీమా బల్, ఇండో టిబెటన్ పోలీసులు విస్తృతంగా గాలించగా మండాల ప్రాంతానికి తూర్పు దిశన హెలికాప్టర్ శిథిలాలు, పైలెట్ల మృతదేహాలు కనిపించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారానికి చెందిన వినయ భాను రెడ్డికి భార్య స్పందనారెడ్డి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్పందన కూడా ఆర్మీలోనే డెంటిస్టుగా పనిచేస్తున్నారు. 2007లో ఆర్మీలో చేరిన భానురెడ్డి ప్రస్తుతం పైలెట్‌గా పనిచేస్తున్నారు.