‘మా పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ బొక్కలో వేయండి’ - MicTv.in - Telugu News
mictv telugu

‘మా పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ బొక్కలో వేయండి’

June 2, 2022

ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్రంలోని బీజేపీపై మండిపడ్డారు. ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్టు చేసి విచారిస్తుండడంపై ఆయన స్పందిస్తూ తీవ్రంగా విమర్శించారు. ‘ఇలా ఒక్కొక్కరిని కాకుండా మొత్తం మంత్రులను, ఎమ్మెల్యేలను ఒకేసారి అరెస్టు చేసి విచారించండి. ఆ తర్వాత మా పని మేం చేసుకుంటాం. పాలనకు ఆటంకం లేకుండా, సమయం వృధా కాకుండా ఉంటుంది’ అని ఎద్దేవా చేశారు. కాగా, ఆప్ మరో మంత్రి మనీష్ సిసోడియాను కూడా ఈడీ ప్రశ్నించనుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అంతేకాక, అవినీతి చేసిన మంత్రులను తాను స్వయంగా పదవుల నుండి తొలగిస్తానని గతంలో జరిగిన సంఘటనను ఉదాహరించారు. దీంతో పాటు ఇటీవల పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలోని ఓ మంత్రి చేసిన అవినీతి రుజువు కావడంతో సస్పెండ్ చేసిన విషయాన్ని చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వారు ఎవరైనా మా పార్టీలో ఉంటే ఉపేక్షించమని, వెంటనే చర్యలుంటాయనే విషయం పై రెండు సంఘటనల ద్వారా రుజువవుతున్నాయని వెల్లడించారు.