యూపీలోని మొరాదాబాద్ ప్రాంతానికి చెందిన పారిశ్రామిక వేత్త అరవింద్ కుమార్ గోయల్ తన యావదాస్తి రూ. 600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. తాను నివసిస్తున్న ఒక్క ఇంటిని మాత్రమే ఆయన ఉంచుకున్నారు. ఆ ఆస్తిని విక్రయించి పేదల సంక్షేమం కోసం వినియోగించాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఓ కమిటీని వేసి తగిన చర్యలకు పూనుకుంది. గోయల్ అంతకుముందు 100కు పైగా వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులకు ట్రస్టీగా ఉన్నారు. కరోనా సమయంలో తన చుట్టుపక్కల 50 గ్రామాల్లో ఆహారం, మందులు సరఫరా చేశారు. అనేక వ్యాపారాలు కలిగిన గోయల్.. ఆస్తిని పంచేయాలని 25 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తన భార్య, ఇద్దరు కుమారులకు చెప్పగా వారు సంతోషంగా అంగీకరించారు. గోయల్ అల్లుడు ఆర్మీలో కల్నల్‌గా పనిచేస్తున్నారు. సమాజం కోసం గోయల్ చేస్తున్న సేవలకుగాను నలుగురు రాష్ట్రపతుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. గోయల్ తల్లిదండ్రులు స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులు. ఆయన బావ గతంలో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేశారు.