Aryan Khan may've been targeted, hints NCB vigilance probe
mictv telugu

టార్గెట్ చేసి షారూక్ ఖాన్ కొడుకుని ఇరికించారు.. ఎన్‌సీబీ రిపోర్టు

October 19, 2022

బాలీవుడ్ ప్రముఖ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) కీలక విషయాలు వెల్లడించింది. కావాలనే కొందరు ఆర్యన్ ఖాన్‌ను ఈ కేసులో ఇరికించారని తాజా నివేదికలో తెలిపింది. కేసు దర్యాప్తులో అనేక అక్రమాలను గుర్తించినట్లు పేర్కొంది. కేసులో సుమారు 8 మంది అధికారుల ప్రవర్తన కూడా అనుమానంగా ఉందని గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ తో పాటు, 8 మంది అధికారుల పై 3వేల పేజీల ఛార్జిషీట్ ను ఎన్‌సీబీ అధికారులు సిద్ధం చేశారు. ఎన్‌సీబీ ముంబయి యూనిట్‌లో విధులు నిర్వహించిన అప్పటి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే సహా ఇతర అధికారులపై చర్యలకు సిఫారసు చేసింది.

ఈ ఛార్జ్‌షీట్ ను దిల్లీలోని కేంద్ర కార్యాలయంలో సమర్పించింది. ముంబై తీరంలోని కోర్డెలియా క్రూయిజ్ షిప్ కేసులో ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో 15 మందిని 2021 అక్టోబర్ 3న ఎన్‌సీబీ అరెస్టు చేసింది. 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్.. అక్టోబరు 30న బెయిల్‌పై విడుదలయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. అయితే, ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో.. ఈ కేసులో ఎన్సీబీ అతడికి ఇటీవల క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది.