యూపీలో 50 వేల మంది విదేశీయులు.. కేంద్రానికి జాబితా - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో 50 వేల మంది విదేశీయులు.. కేంద్రానికి జాబితా

January 14, 2020

nbvh

జనవరి 10న పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. 50 వేల మంది శరణార్థుల జాబితాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, కేంద్ర హోంశాఖకు పంపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్‌ల నుంచి వీరంతా వలస వచ్చారని.. యూపీలో దశాబ్దాలుగా నివసిస్తున్నారని పేర్కొంది. పిలిబిత్, కాన్పూర్, వారణాసి, లక్నో, గోరఖ్‌పూర్, ఆగ్రా, అమేథీ తదితర 19 జిల్లాల్లో వీరంతా నివసిస్తున్నారని యోగీ ప్రభుత్వం పేర్కొంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేది లేదని కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్టాలు చెబుతుండగా.. ఈ చట్టం అమలు దిశగా యూపీ అడుగులు వేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది.

మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయడానికి సుముఖంగా లేరు. ఇటీవలే ప్రధానితో భేటీ అయిన ఆమె సీఏఏ, ఎన్ఆర్సీలను బెంగాల్‌లో అమలు చేయడం తను బతికి ఉన్నంత వరకు సాధ్యం కాదన్నారు. కేరళ ప్రభుత్వం కూడా సీఏఏకు వ్యతిరేకంగా మంగళవారం సుప్రీం కోర్టుకు వెళ్లింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 25లను నూతన సవరణ చట్టం ఉల్లంఘిస్తోందని కేరళ ఆరోపిస్తోంది. పంజాబ్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయనీయబోమని.. ఈ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.