నాగరికతలో వెనుకబడ్డామంటూ.. రెండో వివాహాలు - MicTv.in - Telugu News
mictv telugu

నాగరికతలో వెనుకబడ్డామంటూ.. రెండో వివాహాలు

April 14, 2022

plii

మహిళలపై కఠినమైన ఆంక్షలు విధించడంలో తాలిబన్లు ముందుంటారు. మధ్య యుగాల నాటి పద్ధతులతో మహిళలను జీవితాంతం పరదాల వెనక ఉంచేస్తారు. చదువుకు దూరం చేసి, తోడుగా మగవ్యక్తి లేకుండా బయట తిరగడాన్ని నిషేధిస్తారు. అలాంటి తాలిబన్లు ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలెట్టారు. అమెరికా దళాలు వెళ్లిపోయేంత వరకు అజ్ఞాతంలో ఉన్న తాలిబన్లు ఇప్పుడు అధికారం చేజిక్కించుకున్నాక ఆలోచనలో పడ్డారు. కాలంతో పాటు చేసే ప్రయాణంలో వెనుకబడ్డామనే భావనలో ఉన్నారు. బయటి ప్రపంచంతో పోలిస్తే నాగరికతలో వెనుకబడ్డామని గుర్తించారు. దీన్ని అధిగమించే క్రమంలో చదువుకున్న ఆఫ్ఘన్ యువతులను రెండో వివాహం చేసుకుంటున్నారు.

తమ మొదటి భార్యలు తమతో పాటు అజ్ఞాతంలో ఉండి బొత్తిగా లోకజ్ఞానం లేకుండా ఉన్నారని, అదే చదువుకున్న అమ్మాయి అయితే అన్ని విధాలా కుటుంబానికి మేలు జరుగుతుందని వెల్లడిస్తున్నారు. చదువుకున్న అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకొని పట్టణాలు, నగరాల్లో కాపురాలు పెడుతున్నారు. ఇంతేకాక, తాలిబన్ నేతలు, ప్రభుత్వాధికారులు తమ పిల్లలను విదేశాల్లో మంచి చదువులు చెప్పిస్తున్నారు. ఆడపిల్లలకు కూడా ఆధునిక విద్యను నేర్పిస్తున్నారు. చాలా మంది పాకిస్తాన్, దోహా వంటి దేశాల్లో ఒక పక్క మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యలను అభ్యసిస్తూ, మరోపక్క ఫుట్ బాల్, టెన్నిస్ వంటి క్రీడలలో ఛాంపియన్లుగా రాణిస్తున్నారు. ఇలా కేబినెట్ లోని పాతిక మంది నేతల పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు. ఇదిలా ఉండగా, తమ దేశంలోని ఇతరుల ఆడపిల్లలను మాత్రం చదువుకు దూరం చేస్తున్నారు. ఈ ద్వంద వైఖరిపై స్థానిక యువతులు ప్రధాన కూడళ్లలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీనిపై తాలిబన్ ప్రతినిధులు స్పందిస్తూ.. త్వరలో జరిగే భేటీలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.