నిర్భయ దోషులకు ఉరి.. ఇద్దరు తలారీలు రెడీ! - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ దోషులకు ఉరి.. ఇద్దరు తలారీలు రెడీ!

December 12, 2019

Nirbhaya.

ఉరిశిక్ష పడి, రాజ్యాంగపరంగా సంక్రమించిన అన్ని అవకాశాలూ ముగిసిన నిర్భయ దోషులకు త్వరలో ఉరి తీసేందుకు తిహార్ జైలు అధికారులు సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తిహార్ జైలు అధికారులు తలారీల కోసం ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖకు లేఖ రాశారు. తమకు అవసరమైనప్పుడు ఇద్దరు తలారీలను పంపించాలని లేఖలో పేర్కొన్నారు. అయితే దోషులకు ఉరి ఎప్పుడు? వారు ఎవరు అనే విషయాలను వెల్లడించలేదు. ఈ మేరకు డిసెంబర్‌ 9న తిహార్‌ జైలు నుంచి ఫ్యాక్స్‌ ద్వారా తమకు సమాచారం అందిందని యూపీ జైళ్ల శాఖ అదనపు డీజీ ఆనంద్‌ కుమార్‌ గురువారం తెలిపారు. 

తలారీలు అందుబాటులో ఉంచాలని మాత్రమే చెప్పారని.. అందులో ఏ ఇతర వివరాలూ పేర్కొనలేదని తెలిపారు. యూపీ జైళ్ల శాఖ పరిధిలో లఖ్‌నవూలో ఒకరు, మీరట్‌లో ఒకరు చొప్పున ఇద్దరు తలారీలు ఉన్నారని వెల్లడించారు. ఇదిలావుండగా నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ జైలుకు 15 మంది లేఖలు రాశారు. అందులో రెండు లేఖలు విదేశాల నుంచి వచ్చాయి. గురుగ్రామ్‌, ముంబయి, ఢిల్లీ, తమిళనాడు, చత్తీస్‌గఢ్‌, కేరళ రాష్ట్రాల నుంచి ఈ లేఖలు అందినట్లు జైలు అధికారులు చెప్పారు.