Asaduddin Owaisi Blames Taj Mahal For Petrol Price Hike,
mictv telugu

పెట్రోల్ ధర పెరగడానికి షాజహాన్, ఔరంగజేబులే కారణం.. మోదీపై సైటైర్లు

July 5, 2022

షాజహాన్ తాజ్‌మహల్ కట్టి ఉండకపోతే లీటర్ పెట్రోల్ కేవలం రూ.40లకే వచ్చేదని ప్రధాని మోదీపై సెటైర్లు విసిరారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. దేశంలో ఓ వైపు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నిత్యవసరాల ధరలు మండిపోతుంటే.. బీజేపీ మాత్రం అన్ని సమస్యలకు మొగలులు, ముస్లింలే కారణమన్నట్లు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు.

ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “దేశంలోని నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.104-115కి చేరడానికి తాజ్‍మహల్ కట్టిన వ్యక్తే కారణం. ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్ కట్టి ఉండకపోతే లీటర్ పెట్రోల్‍ను ఇవాళ రూ.40కే అమ్మేవారు. డీజిల్ లీటరు రూ.102కి చేరింది. వీటన్నింటికీ కారణం ఔరంగజేబు. ప్రధాని మోదీ కాదు. తాజ్‌మహల్‌, ఎర్రకోట కట్టి షాజహాన్ పెద్ద తప్పు చేశారు. దాని బదులు షాజహాన్‌ ఆ డబ్బునంతా ఆదా చేసి 2014 ఎన్నికల్లో మీకు(ప్రధాని నరేంద్ర మోదీ) ఇవ్వాల్సింది. దేశంలోని ప్రతి సమస్యకు ముస్లింలు, మొగలులే కారణమని ప్రచారం చేస్తున్నారు” అని ఒవైసీ బీజేపీపై విమర్శల దాడికి దిగారు.