'అసని' ఎఫెక్ట్.. రేపటి ఇంటర్ పరీక్ష వాయిదా - MicTv.in - Telugu News
mictv telugu

‘అసని’ ఎఫెక్ట్.. రేపటి ఇంటర్ పరీక్ష వాయిదా

May 11, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను తీవ్ర తుపానుగా దిశ మార్చుకుని రాష్ట్రం వైపు వస్తుండడంతో రేపు రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నామని అధికారులు బుధవారం ప్రకటించారు. రేపటి ఇంటర్ పరీక్షను మే 25న జరుపుతామని, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ‘అసని’ తుపాన్‌ కారణంగా విద్యార్థులు ఇళ్లలోనే ఉండి, తదుపరి పరీక్షకు సన్నద్దం కావాలని సూచించారు.

మరోపక్క ‘అసని’ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరాలను తాకుతూ, పశ్చిమ బెంగాల్ వైపు వెళుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. అసని దిశ మార్చుకుని మచిలీపట్నం వైపు మరలడంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే రేపటి ఇంటర్ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.