ఐసీసీ బుధవారం టెస్ట్ ర్యాంకింగ్స్‌ని విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో దుమ్మురేపుతున్న భారత ఆల్ రౌండర్లు అశ్విన్, జడేజాలు దూసుకెళ్లారు. బౌలింగ్‌లో అశ్విన్ టాప్ 2 కి చేరగా, ఆల్‌రౌండర్ జాబితాలో కూడా రెండో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా 460 పాయింట్లతో ఆల్‌రౌండర్ జాబితాలో టాప్ 1, బౌలింగులో 9వ స్థానానికి ఎగబాకాడు. బౌలింగులో ఫస్ట్ ప్లేసులో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 866 పాయింట్లతో ఉన్నాడు.
పాట్ కమిన్స్ మూడు, బుమ్రా 5వ స్థానంలో నిలిచారు. బ్యాటింగులో లబుషేన్, స్టీవ్ స్మిత్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా, రిషభ్ పంత్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఏడు, కోహ్లీ 16వ స్థానంలో ఉన్నారు. అటు ఢిల్లీ టెస్టులో విరుచుకుపడిన జడేజా 10 వికెట్లు తీశాడు. దాంతో 2019 తర్వాత మొదటిసారి బౌలింగ్ ర్యాంకులో టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు.
కాగా, బోర్డర్ – గవాస్కర్ సిరీస్‌లో రెండు మ్యాచులు నెగ్గిన టీమిండియా మూడో మ్యాచ్ కూడా గెలిచి టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. ఆటగాళ్ల ఫాం చూస్తుంటే మార్చి 1 నుంచి ఇండోర్ మైదానంలో జరిగే మూడో టెస్టు కూడా కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచులో అశ్విన్ రాణిస్తే బౌలింగ్ విభాగంలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.