నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచులో వారికే అత్యధిక వికెట్లు దక్కాయి. రెండో ఇన్సింగ్స్‌లో అశ్విన్ ఆసీస్ టాపార్డర్‌ని కుప్పకూల్చి కీలకమైన ఐదు వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ ఈ మ్యాచ్ ద్వారా బద్ధలు కొట్టాడు. భారత జట్టు సాధించిన అంతర్జాతీయ విజయాల్లో అనిల్ కుంబ్లే ఇప్పటివరకు 486 వికెట్లు తీయగా, అశ్విన్ 489 వికెట్లతో కుంబ్లేని రెండో స్థానానికి నెట్టాడు. అయితే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లేనే అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక రెండో టెస్టు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగనుండగా, మొదటి టెస్టులో ఘోరంగా ఓడిపోయిన ఆస్ట్రేలియా మైండ్ గేమ్‌కి సిద్దమైంది. తమ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ని రంగంలోకి దింపుతున్నట్టు అధికారికంగా హింట్ ఇచ్చింది. ఓడిన గంటల వ్యవధిలోనే ఈ హింట్ రావడం గమనార్హం. టీమిండియాను గందరగోళానికి గురి చేసే వ్యూహంలో భాగంగా ఆసీస్ ఈ పని చేసిందని క్రికెట్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ బౌలర్ గాయాల నుంచి కోలుకున్నాడని, ఢిల్లీలోని క్యాంపులో త్వరలో జాయిన్ అవుతాడని లీక్ చేసింది. అయితే ఢిల్లీ పిచ్ గతాన్ని చూస్తే స్పిన్నర్లకు అనుకూలించింది తప్ప పేసర్లకు కాదు. ఈ నేపథ్యంలో తీసుకుంటే స్పిన్నర్‌ని తీసుకోవాలి కానీ, పేసర్‌ను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం భారత వ్యూహాలను మిస్‌లీడ్ చేయడానికేనని అభిమానులు కూడా ఆ దేశ క్రికెట్ బోర్డుపై మండి పడుతున్నారు.