తాజ్ మహల్‌పై కొత్త వివాదం.. కృష్ణుడి ఫోటోను తొలగించాలని.. - MicTv.in - Telugu News
mictv telugu

తాజ్ మహల్‌పై కొత్త వివాదం.. కృష్ణుడి ఫోటోను తొలగించాలని..

June 3, 2022

ప్రముఖ పర్యాటక స్థలం తాజ్ మహల్‌పై మరో కొత్త వివాదం వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే తాజ్ మహల్ చరిత్రపై నిజాలు తేల్చాలని, మూసి ఉన్న 22 గదుల తలుపులు తెరవాలని పలు వివాదాలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఈ అద్భుత నిర్మాణంలో శ్రీకృష్ణుడి చిత్రం పెట్టిన స్థలంపై వివాదం రాజుకుంది. మహల్‌లోని ఫోటో గ్యాలరీలో ఉన్న రాధా-కృష్ణుల ఫోటోను .. వాష్‌రూమ్‌కు సమీపంలో ఉంచారని, దీన్ని మార్చమని యూపీకి చెందిన మత్స్యేంద్ర గోస్వామి నిరసన చేపట్టారు. దీంతో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) గోస్వామి డిమాండ్‌కు అంగీకరించి, తాజ్ మహల్ లోపల శ్రీకృష్ణుడి బొమ్మను మార్చింది.

దీనిపై ఏఎస్ఐ ఆగ్రా సూపరింటెండెంట్ ఆర్కే పటేల్ మాట్లాడుతూ.. ఈ గ్యాలరీని ఐటీడీసీ రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిందన్నారు. గ్యాలరీలోని చాలా చిత్రాలు కాలక్రమేణా అరిగిపోయాయని, వాటి స్థానంలో కొత్త చిత్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ వివాదంపై ఆగ్రా టూరిస్ట్ వెల్ఫేర్ ఛాంబర్ సెక్రటరీ విశాల్ శర్మ మాట్లాడుతూ తాజ్ మహల్‌కు సంబంధించి ఇలాంటి పనికిమాలిన వివాదాలను లేవనెత్తడం ద్వారా భారతదేశ ప్రతిష్ఠను పాడుచేస్తున్నారన్నారు. తాజ్‌మహల్‌కు సంబంధించి ఇలాంటి అనవసర వివాదాలు లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.