తనను కావాలనే బదిలీ చేశారని మనస్తాపం చెందిన ఏఎస్ఐ నరసింహం ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన నగరంలోని బాలాపూర్ పోలీస్స్టేషన్ ఆవరణలో చోటు చేసుకుంది. పీఎస్కు సమీపంలోని నీటి ట్యాంకు పైకి ఎక్కి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఏఎస్ఐను సహచరులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల బాలాపూర్ సీఐ తనను వేధిస్తున్నాడంటూ అదే స్టేషన్లో ఏఎస్సై గా పనిచేస్తున్న నరసింహ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అతని ఫిర్యాదును పట్టించుకోకుండా నరసింహను బాలాపూర్ నుంచి మంచాలకు బదిలీ చేశారు. తన తప్పు లేకున్నా సీఐ ఇచ్చిన తప్పుడు రిపోర్టుతో తనను అక్రమంగా బదిలీ చేశారని మనస్తాపం చెందారు. దీంతో శుక్రవారం నరసింహ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. 30 శాతం కాలిన గాయాలతో ఉన్న నరసింహను అపోలో డీఆర్డీవో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.