asia power business women 2022.
mictv telugu

పవర్ మా ఇంటి పేరు అంటున్న మహిళలు

November 12, 2022

asia power business women 2022.

అవకాశాలు మన దగ్గరకు రావు మనమే వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి అంటారు. అవును అది నిజమే అని చేసి చూపించారు ఈ మహిళలు. ఎన్ని అవాంతరాలు వచ్చినా నమ్మింది సాదించడానికి వెనుకాడం అని నిరూపించారు. అందుకే ఫోర్బ్స్ ఏషియాస్ పవర్ బిజినెస్ వుమెన్ లిస్ట్లో చోటు సంపాదించారు గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్. కోవిడ్ కష్టాలు, నష్టాలు దాటుకుని తమ సంస్థలను ముందు తీసుకెళ్ళినందుకే వీరికి ఈ కిరీటం.

హొనాసా కన్జూమర్ కో-ఫౌండర్ గజల్ అలఘ్. చంఢీఘర్ కు చెందిన ఈమె సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది. ఈమెకు ముందు ఈ కుటుంబంలో వ్యాపారం కాదు కదా కనీసం ఉద్యోగం చేసినవాళ్ళు కూడా లేరు. కానీ గజల్ తల్లి ఆమెకు చిన్నప్పటి నుంచి ఆర్ధిక స్వాతంత్రం గురించి నూరిపోసింది, ముఖ్యంగా ఆడవాళ్ళకు. అదే గజల్ ను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది. 17 ఏళ్ళ వయసులో కార్పొరేట్ ట్రైనర్ గా మొదట ఉద్యోగం చేసిన ఈమె తరువాత సక్సెస్ ఫుల్ ఎంటర్ ప్రెన్యూర్, ఇన్నోవేటర్ అండ్ ఇన్వెస్టర్ గా పేరు తెచ్చుకుంది. ఏది చేసినా ఒక ప్రణాళికతో చేయడం తన అలవాటు అని చెబుతున్నారు గజల్. అదే తనను విజయాలబాటలో నడిపిస్తోందని అంటున్నారు. ఎప్పుడో చేయాల్సిన పని అయినా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నాని అదే తనను కోవిడ్ టైమ్ లో కూడా పడిపోనివ్వకుండా చేసిందని చెప్పారు.

నిజానికి కోవిడ్ టైమ్ లో గజల్ వ్యాపారం కుప్పకూలిపోయింది. బయటా, ఇంట్లో అంతా భయం. కానీ దాని నుంచి వెంటనే మేల్కొన్నారు గజల్. ఉన్నదాని కన్నా ఇంకా బాగా ఏం చేయగలం అని ఆలోచించారు. సరికొత్త వ్యూహాలతో వ్యాపారం మళ్ళీ మొదలుపెట్టారు. అక్కడి నుంచి సక్సెస్ సాధించారు. పరిస్థితులు దిగజారిపోయినప్పుడే మానసికంగా గట్టిగా ఉండాలి. అప్పుడే ఎలాంటి దాన్నైనా సాధించొచ్చు అంటున్నారు గజల్.

ఎమ్ క్యూర్ ఫార్మా ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్. ఇదొక్కటే కాదు ఈమె ఎంటర్ప్రెన్యూర్షిప్ కోచ్, యూ ట్యూబ్ టాక్ షో అన్ కండీషన్ యువర్ సెల్ఫ్ విత్ నమితా థాపర్ నిర్వాహకురాలు కూడా. తాను ఒక సక్సెస్ ఫుల్ ఎంట్రప్రెన్యూర్ మాత్రమే కాదు తనలా అవ్వడానికి పాఠాలు కూడా చెబుతున్నారు నమిత. తన లేటెస్ట్ బుక్ ది డాల్ఫిన్ అండ్ ది షార్క్: లెసెన్స్ ఇన్ ఎంట్రప్రెన్యూర్ కు మంచి ఎప్లాజ్ వచ్చింది. అదే ఆమెను ఫోర్బ్స్ లో చోటు సందించుకునేలా చేసింది కూడా.

నమితా థాపర్ చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవారుట. ఆమెను చాలామంది ఆట పట్టించేవారుట కూడా. దీనివల్ల తాను చాలా బాధ అనుభవించాను అని అంటున్నారు నమితాథాపర్. అయితే కొన్నాళ్ళ తర్వాత తనను తాను తెలుసుకున్నాని చెప్పారు. ప్రపంచం కోసం మనం బతకకూడదు మనకోసం మనం బతకాలి అనే విషయాన్ని వంటబట్టించుకున్నాని అంటున్నారు. అప్పటి నుంచీ తాను ఏ రోజూ ఆత్మవిశాసం కోల్పోలేదని చెబుతున్నారు నమిత.

సోమా మండల్… భువనేశ్వర్ కు చెందిన ఈమె చదువులో ఎప్పుడూ టాపరే. కానీ ఆమె తండ్రికి మాత్రం ఆడపిల్లల విషయంలో కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి. అందులో ఒకటి ఆడపిల్లలు ఇంజనీరింగ్ లో రాణించలేరు అని. కానీ సోమా ఇంజనీరింగే చదవాలనుకుంది. కష్టపడి తండ్రిని ఒప్పించింది. మొదట ఒప్పుకోకపోయినా కూతురు పట్టుదలకు మాత్రం తలవొగ్గారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ తీసుకున్న సోమా అల్యూమినియం తయారీ సంస్థ నాల్కోలో మొదట ట్రైనీగా చేరింది. అక్కడ నుంచీ ఒక్కో మెట్టూ ఎదుగుతూ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు మొదటి మహిళా ఛైర్ పర్శన్ గా చరిత్ర సృష్టించింది. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాలబాట పట్టించి తన మార్క్ ప్రపంచం అంతా తెలిసేలా వేసింది.

కృషి, పట్టుదల ఉంటే దేన్పైనా సాధించొచ్చని ఇంతకు మనకు చాలా మంది చేసి నిరూపించారు. ఇప్పడు ఈ ముగ్గురు మహిళలు కూడా ఆ జాబితాలో చోటు సంపాదించుకుని సగర్వంగా తలెత్తి నిలుచున్నారు.