నేటి నుంచి బయో ఆసియా 2023 సదస్సు - MicTv.in - Telugu News
mictv telugu

నేటి నుంచి బయో ఆసియా 2023 సదస్సు

February 24, 2023

bioasia

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోయే బయో ఏషియా (20వ సదస్సు) సదస్సు శుక్రవారం ప్రారంభం కానున్నది. నేటి నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) వేదికగా జరగనున్న ఈ సదస్సును ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ సమ్మిట్ లో ప్రధానంగా లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, మెడ్‌టెక్‌, ఆరోగ్య సంరక్షణ రంగాలపై నిపుణుల ప్రసంగాలు, బృంద చర్చలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి రెండు వేలకు మందికిపైగా ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇంటరాక్టివ్‌ సెషన్స్‌, సీఈవో కాంక్లేవ్‌ వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. రెండురోజులపాటు లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, పరిశ్రమ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తారు. చివరిరోజు వివిధ కంపెనీలకు చెందిన ప్రదర్శన ఉంటుంది. జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తారు.

19 ఏళ్లుగా హెల్త్ కేర్ రంగంలో ఎన్నో స్టార్టప్‌లకు అవకాశమిచ్చిన బయో ఆసియా సదస్సు ఈ ఏడాది సైతం స్టార్టప్‌లకు మద్దతు ఇస్తోంది. జీవశాస్త్ర రంగంలో 2028 నాటికి రాష్ట్రంలో 8 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2028 నాటికి రాష్ట్రంలో లైఫ్‌సైన్స్ ఎకో సిస్టం విలువను రెట్టింపు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ బయో ఆసియా సదస్సుతో మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తామని వివరించారు.