గుడిలో ఆసిఫాపై ఘోరం జరిగిందా? లేదా?.. వాస్తవాలు ఇవీ.. - MicTv.in - Telugu News
mictv telugu

గుడిలో ఆసిఫాపై ఘోరం జరిగిందా? లేదా?.. వాస్తవాలు ఇవీ..

April 17, 2018

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కశ్మీర్ ముస్లిం బాలిక ఆసిఫా కేసుపై రాజకీయాలు చాలానే జరుగుతున్నాయి. మతం, స్థానిక భూవివాదాలు, మరెన్నో అంశాలతో ముడిపడిన ఈ కేసుపై రాజకీయాలు సహజమే. అయితే బాధిత కుటుంబంపైనే నిందలేసే స్థాయికి దిగజారడం మటుకు గర్హనీయం. ఆసిఫాపై ఆమెకు తెలిసిన ముస్లింలే అఘాయిత్యానికి పాల్పడి చంపేసి, హిందూ దేవత గుడిలో పడేశారని కొందరు అంటున్నారు..!  అసలు ఆ గుడిలో గ్యాంగ్‌రేప్ జరగనేలేదని, రోజూ భక్తులు వచ్చే గుడిలో అలాంటిది సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఫోరెన్సిక్ నివేదికను సీఎం మెహబూబా ముఫ్తీ మార్చేశారని అంటున్నారు.

సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఎక్కువ. ఎవరు ఏదైనా రాసుకునే స్వతంత్రం ఉంది. కానీ బాధితుల పక్షాల నిలబడం కనీస మానవధర్మం. బాధితులను మరింత పీడించి, వేధించడం సరికాదు. ఆసిఫా కేసులో నిజానిజాలను పోలీసులు ఇప్పటికే నిగ్గదేల్చారు. ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతోంది. నిందితులు కోర్టులో తమ వాదన వినిసిస్తున్నాయి. అన్నీ ఎప్పటికప్పుడు  మీడియా ద్వారా దేశమంతా తెలుస్తూనే న్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నా నిజాలు నిప్పులు. దాచేస్తే దాగవు!

ఏమంటున్నారు?

కతువా జిల్లా హిరానగర్ తహశీల్లోని రసనా గ్రామంలో ఈ ఘోరం జరిగింది. గ్రామానికి దూరంగా విసిరేసినట్లు ఉన్న కుల్ దేవీ గుడిలో ఈ దారుణం జరిగిందని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. అయితే ‘ఊరి మధ్యలో’ ఉన్న గుడిలో, 8రోజుల పాటు ‘అందరూ వచ్చీపోయే’ చోట ఇది సాధ్యం కాదని, వాస్తవానికి ఒక మదర్సాలో అఘాయిత్యానికి పాల్పడ్డి, ఆసిఫా శవాన్ని గుడి పరిసరాల్లో వేశారని నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకున్న నెటిజన్లు అంటున్నారు. గుడిలో ఏం జరుగుతుందో బయటి నుంచి చూస్తే కనిపిస్తుందని చెబుతున్నారు.

నిజం ఇదీ..

గుడి ‘ఊరి మధ్య’లో లేదు. ఊరికి దూరంగా విసిరేసినట్లు ఉంది. చుట్టూ పొదలు, అడవి ఉన్నాయి. అక్కడి నుంచి కొద్ది దూరంలో మొదటగా తగిలే ఇల్లు ప్రధాన నిందితుడైన సంజీరామ్‌ది. గుడికి అతడే పర్యవేక్షకుడు. ఈ గుడిలో రోజూ పూజలు జరగడం లేదు. జనం కూడా రావడం లేదు. ముఖ్యమైన దినాల్లో మాత్రమే తెరచి ఉంచుతారు. గుడి నుంచి ఊరిలోకి రావాలంటే మట్టిరోడ్డు గుండా కి.మీ. దూరంపైగా నడవాలి. మదర్సాలో ఘోరం చేసి, గుడిలో మృతదేహాన్ని వదిలి వెళ్లారన్నది అవాస్తవం. అసలు మృతదేహం గుడిలో దొరకలేదు. ఈ దారికి కాస్త లోపలివైపున అడవిలో కనుగొన్నారు. గుడికి మూడు తలుపులు ఉన్నాయి. అయితే ఒక తలుపునే తెరుస్తున్నారు. లోపల ఏం జరుగుతుందో బయటికి తెలిసే అవకాశం లేదు. గుడిలో ఆసిఫాను ఆరు రోజులు ఉంచారు. భారీ మోతాదులో మత్తు ఇవ్వడంతో ఆమె కదిలే స్థితిలోగాని, అరిచే స్థితిలోగాని లేదు. పూజావేదిక వెనుక టేబుల్ కింద పడుకోబెట్టి, చుట్టూ చాపలు, దుప్పట్లు కప్పారు. గుడికి వచ్చినవారు పూజావేదిక వెనక్కి వెళ్లే అవకాశం లేదు. అక్కడి తతంగమంతా సంజీరామ్ చేతుల్లో జరుగుతుంది. ఘోరం జరిగిన రోజుల్లో మైనర్ నిందితుడు, సంజీరామ్ లే గుడి తాళాలు తెరిచినట్లు పోలీసు తెలిపారు. కుల్ దేవీ గుడిని పవిత్రంగా భావించే తాము అక్కడ ఆసిఫా కోసం వెతకలేదని, మిగతా ఊరంతా, అడవి అంతా వెతికామని ఆమె తండ్రి చెప్పాడు. సంజీరామ్‌కు మద్దతు తెలుపుతున్న స్థానికులు కూడా తాము ‘ఘోరం’ రోజుల్లో గుడిలోకి వెళ్లలేదని చెబుతుండడం గమనార్హం.  

మరిన్ని అసత్యాలు..

హత్య జరిగిందని, అత్యాచారం జరగలేదని మొదటి పోస్ట్ మార్టం నివేదికలో ఉందని, అయితే రెండో పోస్ట్ మార్టంలో అత్యాచారం కథ అల్లారని అంటున్నారు. నిజానికి ఈ కేసులో రెండో పోస్ట్ మార్టం జరగనేదు. ఆసిఫా దుస్తులకు అంటుకున్న మట్టికి, రసనా గ్రామంలోని మట్టికి పోలిక లేదని ఫోరెన్సిక్ నివేదికలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ విషయం ఫోరెన్సిక్ నివేదికలో లేదు. పోలీసులు కూడా దీన్ని కొట్టిపారేస్తున్నారు. దుస్తులకు అంటుకున్న మట్టి, రక్తపు మరకలను నిందితులతో కుమ్మక్కైన పోలీసులు శుభ్రం చేసి ల్యాబ్‌కు పంపారని చార్జిషీటులో తెలిపారు. సంజీరామ్ కొడుకు విశాల్ జంగోత్రా మీరట్ నుంచి రసనాకు రానేలేదని, అతడు కాలేజీలో బీఎస్సీ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడని చెబుతున్నారు. అయితే అతనికి ఫోన్ చేసి ‘రేప్’ చేయడానికి రావాలని తాను చెప్పినట్లు నిందాతుడైన మైనర్ అంగీకరించాడు. పైగా కాలేజీలో విశాల్ తన బదులు వేరే విద్యార్థితో పరీక్ష రాయించినట్లు అక్కడి సీసీ కెమరాల్లో రికార్డయింది.

సంజీరామ్ పోలీసులకు అన్నేసి లక్షల లంచం ఇచ్చారడం సరికాదని, ఒక చిన్న రిటైర్డ్ ఉద్యోగికి అది సాధ్యమాని అని ప్రశ్నిస్తున్నారు. సంజీర్ డిసెంబర్, జనవరి నెలల్లో బ్యాంకు నుంచి రూ. 10 లక్షలు డ్రా చేసినట్లు ఆధారాలు ఉన్నాయని,  అతడు తన చెల్లెలి ద్వారా ఎస్ఐకి రూ. 1.50 లక్షల లంచం పంపాడని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ‘మైనర్’ నిందితుడికి 15 ఏళ్లని, అతడు అంత ఘోరం ఎలా చేస్తాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిందితుడికి 19 ఏళ్లని డీఎన్ఏ పరీక్షలో తేలినట్లు అధికారులు చెబుతున్నారు. సకల దురలవాట్లూ ఉన్న అతడు అతడు గతంలో ఒక ముస్లిం యువతిని వేధించి, తన్నులు తిన్నాడని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పేవాడని అతని మిత్రుడు దర్యాప్తు అధికారులకు తెలిపాడు.  

నిందితుల కుటుంబ సభ్యులు లేవనెత్తుతున్న ప్రశ్నలకంటే కొన్ని రాజకీయ పార్టీలు, వాటి సంఘాలు మద్దతుదారులు లేవనెత్తతున్న ప్రశ్నలు మరీ ఘోరంగా ఉన్నాయి. బంగ్లాదేహ్ రోహింగ్యా ముస్లింలను జమ్మూలోకి తీసుకురావడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళిక వేసిందని, దీనికి కోసం అల్లర్లను రెచ్చగొట్టేందుకు ఆసిఫా కేసును వాడుకుంటోందని అంటున్నారు!