‘ఆసిఫా’ తరహా ఘోరానికి బలైంది ఏపీ చిన్నారే! - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆసిఫా’ తరహా ఘోరానికి బలైంది ఏపీ చిన్నారే!

April 18, 2018

ఎనిమిదేళ్ల కశ్మీర్ బాలిక ఆసిఫాపై జరిగిన గ్యాంగ్ రేప్, హత్య దేశాన్ని కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా అలాంటి నేరాలింకా కొనసాగుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో 8 రోజుల పాటు అత్యాచారానికి, తర్వాత హత్యకు గురైన 12 ఏళ్ల బాలిక ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు తీవ్రయత్నాలు చేస్తున్నారు. ఒంటిపై 86 గాయాలతో లభించిన ఆ చిన్నారి ఫొటో ఆధారంగా ఆమె ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మార్కాపూరంలోని బాలికల వసతిగృహం నుంచి గత ఏడాది అక్టోబర్‌లో పారిపోయిన మాకం చిన్ని(12)గా భావిస్తున్నారు.గుజరాత్‌లో ఘాతుకానికి బలైన చిన్నారి ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఈ నెల 6న విగతజీవిగా కనిపించిన ఆ చిన్నారిని గుర్తించడానికి.. తప్పిపోయిన 8 వేల మంది బాలికల ఫొటోలను పరిశీలించారు. మృతురాలికి మాకం చిన్ని ఫొటోతో పోలికలు కనిపించాయి. ఏపీ పోలీసులు వెంటనే చిన్ని తల్లిదండ్రులను పిలిపించి విచారించారు. వారితో కలసి సూరత్ వెళ్లారు. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఆమె చిన్నినే కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే చిన్ని ఆధార్‌కార్డులోని పుట్టుమచ్చలు, వేలిముద్రలు మృతురాలి వివరాలతో సరిపోలలేదు. దీంతో తల్లిదండ్రుల, చనిపోయిన బాలిక డీఎన్‌ఏలను సరిపోల్చనున్నారు.