అసిఫా కథ.. ఆది నుంచి అంత్యక్రియల వరకు.. - MicTv.in - Telugu News
mictv telugu

అసిఫా కథ.. ఆది నుంచి అంత్యక్రియల వరకు..

April 13, 2018

ఇప్పుడు దేశం మొత్తం అసిఫా బానో కోసం విలపిస్తోంది. ఆ పసికందు లేతదేహంపై కామ పిశాచాలు, కక్షల దెయ్యాలు.. దేవుడి గుడి సాక్షిగా చేసిన గాయాలు మనసున్న ప్రతి మనిషినీ కదిలిస్తున్నాయి. ఎనిమిదేళ్ల అసిఫాపై హిందువుల గుడిలో వారం పాటు సాగిన సామూహిక అత్యాచారం, మాటల్లో చెప్పలేని ఘోరాలపై విరివిగా కథనాలు వస్తున్నాయి. అయితే అత్యంత దారుణమైన ఈ ఘటనపై పూర్తి వివరాలు అందుబాటులోకి లేవు.

అసలు అసిఫానే ఎందుకు టార్గెట్ చేశారు? ఆమెను ఎలా కిడ్నాప్ చేశారు? గుడిలో ఆ చిన్నారిపై మృగాలు దాడి చేస్తున్న సంగతి పోలీసులకు తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నారు? చివరికి ఆ చిన్నారి మృతదేహం ఎలా బయటపడింది? బతికి ఉన్నప్పుడు పీక్కుతిన్న దుర్మార్గులు ఆ పిల్ల అంత్యక్రియలకు కూడా ఎలాంటి ఆటంకాలు కల్పించారు? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి, ఈ దారుణం వెనుక ఉన్న నేపథ్యాన్ని వీలైనంత సమగ్రంగా వివరించే ప్రయత్నం చేస్తోంది మైక్ టీవీ..

చాలా ఏళ్లనుంచే ముస్లింపై కక్ష..

అది జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లా, హిరానగర్ తహసీల్‌లోని రసనా గ్రామం. అందమైన పల్లెటూరు. 50 ఏళ్ల మహమ్మద్ యూసఫ్ అనే ముస్లిం కుటుంబం అక్కడ నివసిస్తోంది. సంచార పశుపాలక బకర్వాల్ తెగకు చెందిన అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిన్నకూతురు అసిఫాకు ఎనిమిదేళ్లు. యూసఫ్ వృత్తి గుర్రాలు, గొర్రెల పోషణ.

బకర్వాల్ ముస్లింలతో రసనా గ్రామానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి, ధనవంతుడు, పురోహితుడు, బ్రాహ్మణుడైన సంజీరామ్‌(60)కు వివాదాలు ఉన్నాయి. బకర్వాళ్లకు చెందిన పశువులు తన ఇంటి పరిసరాల్లో మేత మేయడం అతనికి సుతరామూ ఇష్టం లేదు. అసలు వారి ఉనికే భరించలేడు. ఒకసారి రషీద్ అనే మహిళ మేకలు అతని ఇంటి దగ్గర్లోని కుంటలో నీరు తాగాయని వాటిని స్వాధీనం చేసుకున్నాడు. వెయ్యి జరిమానా కట్టించుకుని వదిలేశాడు. అసిఫా తండ్రి యూసఫ్ పశువులు తన ఇంటి దగ్గర్లో మేశాయని గత డిసెంబర్‌లో వెయ్యి జరిమానా వేశాడు. సంజీరామ్‌కు తన ఇంటి వెనుకే ఉన్న గుడికి పురోహితుడు కూడా.

బకర్వాల్ ముస్లింలకు పశుగ్రాసం కోసం పొలాలు అమ్మకూడదని సంజీరామ్ ఊర్లోని హిందువులకు నూరిపోసేవాడు. ఈ గొడవలతో ముస్లింలకు అతనికి మధ్య ఘర్షణ జరిగింది. ముస్లింలపై కక్ష పెంచుకున్న, భూతగాదాలు ఉన్న మరికొందరు కూడా సంజీరామ్‌కు తోడయ్యారు. ఎట్లాగైనా ముస్లింలను ఆ చుట్టుపక్కల ఊర్ల నుంచి వెళ్లగొట్టడానికి సంజీరామ్ పథకం వేశాడు.

జనవరి మొదటి వారంలోనే స్కెచ్..

ఈ ఏడాది జనవరి మొదటి వారంలో సంజీరామ్ ప్రణాళిక వేశాడు. ముస్లింలలో తీవ్ర భయాందోళనలను సృష్టించే దారుణానికి కుట్ర జరిగింది. తన మేనల్లుడైన శుభం సంగ్రా, స్పెషల్ పోలీస్ అధికారి దీపక్ కజూరియా, సంగ్రా మిత్రుడైన పర్వేష్ తదితరులతో పథకం వేశాడు. సంగ్రా మైనర్ అని అంటున్నారు.. అయితే 19 ఏళ్లని డీఎన్ఏ రిపోర్టు చెబుతోంది. సంగ్రా ఆకతాయితనాన్ని భరించలేని ముస్లింలు గతంలో అతనిపై చేయి చేసుకున్నారు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని మేనమామ ఉసిగొల్పాడు. యూసఫ్ చిన్నకూతురు అసిఫాను కిడ్నాప్ చేసి, గుడిలో సామూహికంగా అత్యాచారం జరిపి, తర్వాత చంపేయాలని అనుకున్నారు. అసిఫాపై అంతకుముందే ఎస్పీవో దీపక్ కన్నేసి ఉన్నాడు. ఆ పిల్లను పట్టుకొస్తే నిన్ను పరీక్షల్లో పాస్ చేయిస్తానని సంగ్రాకు ఆశ చూపాడు దీపక్.

జనవరి 4న పథకం తయారైంది. 9వ తేదీన సంగ్రా, దీపక్ హిరానగర్ వెళ్లి, 4 మత్తు మాత్రలను కొన్నారు. సంగ్రా ఒకటి అక్కడే వేసుకున్నాడు. సంగ్రా, పర్వేశ్‌లు తర్వాత కోటా మోర్హ్ పట్టణానికి వెళ్లి ఓ మెడికల్ షాపులో మత్తు కలిగించే ఎపిట్రిల్ మాత్రలు కూడా కొన్నారు. దీపక్ మానసిక వ్యాధితో బాధపడుతున్న తన మేనమామకు ఓ డాక్టర్ రాసిచ్చిన మందు చీటీని చూపి కొన్నాడు.  

వాడు మైనర్ కాదు.. మదాంధుడు..

శుభం సంగ్రాకు అప్పటికే నేరచరిత్ర ఉంది. మైనరైనా అన్ని దురలవాట్లూ ఉన్నాయి. పరీక్షలు తప్పాడు. మద్యం, సిగరెట్, గుట్కా, డ్రగ్స్ వాడుతున్నాడు. వేశ్యల వద్దకూ వెళ్లేవాడని తెలుస్తోంది. స్కూల్లో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతణ్ని భరించలేక స్కూలు నుంచి బహిష్కరించారు. దీంతో తల్లిదండ్రులు మూడు నెలల కిందట మేనమామ అయిన సంజీరామ్ వద్దకు పంపాడు. పొలం, పాడి పనులు అప్పగించాడు మేనమామ.

గుర్రాలు చూపిస్తానని కిడ్నాప్..

అసిఫాను కిడ్నాప్ చేయడానికి శుభం సంగ్రా అదును కోసం ఎదురుచూశాడు. జనవరి 10న అసిఫా ఎప్పట్లాగే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గుర్రాలను మేపడానికి దగ్గర్లోని అడవిలోకి వెళ్లింది. సాయంత్రం నాలుగు గంటలకు గుర్రాలు ఇంటికి తిరిగొచ్చాయి. అసిఫా రాలేదు. యూసఫ్ కంగారు పడ్డాడు. భార్యతో, బంధుమిత్రులతో కలసి వెతకడానికి వెళ్లాడు. అడవిలో గాలించారు. ఆచూకీ లేదు. సంజీరామ్ ఇంటి వద్దా, గుడి వద్ద వాకబు చేశాడు యూసఫ్. ‘బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందిలే. ఎక్కడిపోతుంది, తిరిగి వస్తుంది..’ అని సంజీరామ్ చెప్పాడు. మరుసటి రోజు కూడా పాప కనిపించకపోవడంతో యూసఫ్ 12న హిరానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు కొందరిపై అనుమానం ఉందన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంజీరామ్ ఇంటి వద్ద అసిఫా…

రెండురోజులు వెనక్కి వెళ్దాం.. 10వ తేదీన అసిఫా తన గుర్రాల్లో కొన్ని కనిపించడం లేదని సంజీరామ్ ఇంటి దగ్గర్లో ఉన్న వీణాదేవి అనే మహిళకు చెప్పింది. అప్పటికి బాగా పొద్దు పోయింది. సంగ్రా మేనమామ ఇంట్లోనే ఉన్నాడు. అసిఫా మాటలు వినిపించాయి. గుడి(దేవీస్తాన్) తాళాలు తీసుకుని ఇంట్లోంచి బయటికొచ్చాడు. ‘నీ గుర్రాలు నేను చూశాను.. అడవిలో ఉన్నాయి, చూపిస్తా పద’ అని చిన్నారిని నమ్మించాడు. అప్పటికే అడవిలో గడ్డికోసం, ఇతర పనుల కోసం వచ్చే సంగ్రాను చాలాసార్లు చూసి వుండడంతో అసిఫా నమ్మేసింది.

గుడిలో బల్లకింద దాచి..

సంగ్రా ప్లాన్ ప్రకారం అక్కడే ఉన్న పర్వేష్‌కు సైగ చేసిన తనవెంట రమ్మన్నాడు. అసిఫా ఆ ఇద్దరు తనకు ఏదో ముప్పు తలపెడతారని పసిగట్టింది. పారిపోవడానికి యత్నించింది. ఆ దుర్మార్గులు అప్రమత్తమయ్యారు. సంగ్రా.. అసిఫా అరవకుండా నోరుమూశాడు. పర్వేశ్ కాళ్లు పట్టుకున్నాడు. మత్తుమాత్రను ఆమె గొంతులో వేశాడు. అసిఫా స్పృహ తప్పింది. సంగ్రా అక్కడే ఆమెపై అత్యాచారం చేశాడు. పర్వేశ్ కూడా రేప్ చేయడానికి యత్నించాడు. కానీ ఎవరైనా చూస్తారనే  భయంతో వెనక్కి తగ్గాడు. తర్వాత అసిఫాను గుడిలోకి మోసుకెళ్లి ఒక టేబుల్ కింద దాచి, బయటికి కనబడకుండా ప్లాస్టిక్ చాపలు దించారు.

రోజూ దారుణాలు..

Image result for asifa

 

గుడిలో అసిఫాపై నిందితులు రోజూ అత్యాచారాలకు పాల్పడ్డారు. మొదటిరోజు సంగ్రా కొంత భోజనం తెచ్చిపెట్టాడు. భోజనం చేయగానే చిన్నారి నోట్లో మత్తుమాత్రలు వేసి ఘోరానికి తెగబడేవారు. తర్వాత తాళం వేసుకుని వెళ్లేవారు. సంగ్రా దగ్గర్లోని చేతిపంపు నుంచి నీరు తెచ్చి అసిఫా గుప్తాంగాలను కడిగేవాడు. రాత్రి చాలా పొద్దుపోయాక బయటికి తీసుకెళ్లి కాలకృత్యాలు తీర్చుకొమ్మనేవాడు. చాక్లెట్లు కూడా ఇచ్చాడు. 11వ తేదీని సంగ్రా.. మీరట్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సంజీరామ్ కొడుకు, తన బావ అయిన విశాల్ జన్గోత్రాకు ఫోన్ చేశాడు. ‘నీ కామవాంఛను తీర్చుకోవాలంటే ఇంటికి రా.. ’ అని చెప్పి, అసిఫా కిడ్నాప్ సంగతి వివరించాడు. విశాల్ వెంటనే బయల్దేరి వచ్చేశాడు. 600 కి.మీ. ప్రయాణించి మరుసటి గుడిలో దూరాడు. ఆ రోజు రాత్రి సంగ్రా.. అసిఫాకు మూడు మత్తు మాత్రలు వేశాడు. రాక్షసకాండ కొనసాగింది.

పోలీసులు వచ్చారు..

అసిఫా తండ్రి ఫిర్యాదుపై కేసు పెట్టిన పోలీసులు పాప కోసం వెతుక్కుంటూ సంజీరామ్ ఇంటికి వచ్చారు. దీపక్ కూడా తనకేమీ తెలీదన్నట్లు వారితో కలసి వచ్చాడు. ఘోరాన్ని పోలీసులు పసిగట్టారు. విషయం బయపడకుండా సంజీరామ్ డబ్బులు వెదజల్లాడు. ఐదారు లక్షలు ఇస్తానన్నాడు. దీంతో ఖాకీల కళ్లు మెరిశాయి. హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, ఎస్ఐ ఆనంద్ దత్తాలకు, మరికొందరు రక్షక భటులకు వాటాలు కుదిరాయి. సంగ్రా తల్లి, సంజీరామ్ సోదరి తృప్తాదేవి,  తిలక్ స్కూల్లో సహవి ద్యార్థులు కావడం కుట్రకు కలిసొచ్చింది. సంజీరామ్ ఆమె ద్వారా 1.5లక్షలకు తిలక్‌కు పంపాడు.

ఆ రాత్రి గుడిలో పూజలు

13వ రాత్రి 8 గంటలకు విశాల్,  సంజీరామ్ గుడిలోకి వెళ్లాడు. సంజీరామ్ పూజలు చేశారు. పర్వేశ్ కూడా వచ్చాడు. సంజీరామ్ బయట కొచ్చాక.. అసిఫాపై అత్యాచారకాండ సాగింది. విశాల్, సంగ్రాలు సమూహికంగా దారుణానికి తెగబడ్డారు. బాలిక నోట్లో 3 మాత్రలు వేసి, మత్తులోకి పంపారు.

ఇక చంపండి..

Image result for asifa

విషయం పోలీసులకు తెలిసిందని, ఇక అసిఫాను చంపాలని సంజీరామ్ కామాంధులకు చెప్పాడు. అసిఫాను పర్వేష్, విశాల్, సంగ్రాలు గుడిలోనుంచి పక్కనే ఉన్న కల్వర్టు వద్దకు మోసుకెళ్లారు. అక్కడికి దీపక్ కూడా వచ్చాడు. ‘చంపేసే ముందు నేనొకసారి రేప్ చేస్తా..’ అన్నాడు దీపక్. దీపక్ తర్వాత సంగ్రా కూడా పైశాచికానికి పాల్పడ్డాడు. తర్వాత దీపక్.. మత్తులో ఉన్న, చిక్కి శల్యమైపోయిన అసిఫా గొంతు పిసికాడు. సంగ్రా కూడా ఆ చిన్నారి వీపుపై మోకాళ్లతో నొక్కుతూ ప్రాణం తీశాడు. చున్నీ బిగించి చిన్నారి ఉసురు తీసుకున్నారు. చనిపోయిందో లేదో నిర్ధారించుకోవడానికి సంగ్రా.. రెండుసార్లు తలపై బండరాయితో మోదాడు.

ప్లాన్ ప్రకారం అసిఫా మృతదేహాన్ని హిరానగర్ కెనాల్లో పారేయాలనుకున్నారు. అయితే అప్పటికి తాము అనుకున్న కారు రాలేదు. దీంతో మృతదేహాన్ని మళ్లీ గుడిలోకి తీసుకొచ్చారు. మరుసటి రోజు కూడా కారు అందుబాటులోకి రాలేదు. రేపు(16న) గుడిలో పూజ కోసం జనం వస్తారని, ఆ లోపు శవాన్ని ఎక్కడికైనా పడేయాలని సంజీరామ్ చెప్పాడు. సంగ్రా, విశాల్ కలసి శవాన్ని గుడినుంచి బయటికి తీసుకెళ్లారు. అడవిలోని పొదల్లో పడేశాడు. తర్వాత సంగ్రా.. అదే రోజు ఊర్లోకి వెళ్లి తాను అసిఫాను రేప్ చేశానని అమిత్ శర్మ అనే స్నేహితుడికి చెప్పాడు. విశాల్ జన్గోత్రాతో కలసి గార్వాల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. విశాల్ ఏమీ ఎరగని వాడిలా రైల్లో మీరట్ వెళ్లిపోయాడు.

దర్యాప్తు..

Image result for asifa police

యూసఫ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది. ఎస్ఐ ఆనంద్ దత్తా నిందితులతో కుమ్మక్కు కావడంతో పావులు కదిపాడు. సంజీరామ్ వద్దకు వెళ్లి.. కేసు చేయి దాటిపోయిందని, ముస్లింల ఆందోళన తీవ్రమైందని భయపెట్టాడు. నిందితులను అప్పగించాలన్నాడు. దీంతో సంజీరామ్ మరో లక్ష వెదజల్లాడు.

మృతదేహం బయటపడింది..

జనవరి 17న జగదీశ్ రాజు అనే కుర్రాడు అడవిలో తప్పిపోయిన గొర్రెల కోసం వెతుకుతుండగా అసిఫా మృతదేహం కనిపించింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు 19వ తేదీన సంగ్రాను అదుపులోకి తీసుకున్నారు. సంజీరామ్ ఠాణాకు వెళ్లాడు. ఎట్టిపరిస్థితిలోనూ తన కొడుకు పేరు చెప్పొద్దని, కేసు నుంచి త్వరలోనే విడిపించి బయటికి తీసుకొస్తానని మేనల్లుడికి చెప్పాడు.

సాక్ష్యాధారాలు నాశనం చేయడానికి..

లంచం తీసుకున్న ఎస్‌ఐ కేసును పక్కదారి పట్టించబోయాడు. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న గదీ అనే కుర్రాడిపై నేరం మోపుతామని నిందితులకు చెప్పాడు. కానీ సంగ్రా భయపడిపోయి ఎస్ఎస్ఎపీ వద్ద మొత్తం బయటపెట్టేశాడు. అయినా ఎస్ఐ కుట్ర సాగించాడు. 19న హత్యాస్థలానికి వెళ్లి సంగ్రా చేతిలో రాయిపెట్టించి ఫొటో తీశాడు. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి చేయాల్సిందంతా చేశాడు. బురద, రక్తపు మరకలున్న అసిఫా దుస్తులను శుభ్రం చేయించి, తర్వాత లేబొరేటరీకి పంపాడు. అసిఫా వేసుకున్న పూసల దండను నాశనం చేసి, మరో దండ వేశాడు. దేవిస్తాన్(గుడి) వైపు అసలు వెళ్లలేదు. అయితే అక్కడ రక్తపు, వీర్యపు మరకలు, అసిఫా హెయిర్ బ్యాండ్, వెంట్రుకలు ఉన్నాయి.

ఆందోళనలు, నిరసలు..

Image result for asifa

బకర్వాల్ ముస్లింలు ఈ ఘోరంపై తీవ్ర నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దీంతో ఎస్ఐ వెనక్కి తగ్గక తప్పలేదు. దర్యాప్తు ముందుకు సాగింది. 130 మంది సాక్ష్యాలను సేకరించారు. నిందితులను తమదైన శైలిలో విచారించేసరికి అసలు విషయం తెలిసింది. డీఎన్ఏ పరీక్షలు, ఫోన్ కాల్‌డేటా, సంజీరామ్ ఇంటిద్ద అసిఫాను చూసిన వీణాదేవి వంటి ప్రత్యక్ష సాక్షులు, ఊరి ప్రజలు చెప్పిన వివరాలతో నేరస్తుల ఆటకట్టయింది.

అంత్యక్రియలకు కూడా ఒప్పుకోలేదు..

యూసఫ్ తన ముద్దుబిడ్డ అంత్యక్రియలన కూటా గ్రామంలోని స్వస్థలంలో జరపాలకున్నాడు. కన్నీరుమున్నీరవుతూ నిర్జీవదేహాన్ని అక్కడికి తీసుకెళ్లాడు. అయితే అక్కడి హిందువులు అడ్డుకున్నారు. బాలికను ఖననం చేస్తే విధ్వంసం సృష్టిస్తామని బెదిరించారు. దీంతో అసిఫాను ఏడు కిలోమీటర్ల దూరంలోని మరో గ్రామంలో ఖననం చేశారు.

బీజేపీ, హిందూనేతల అండ..

నేరస్తులను కాపాడ్డానికి బీజేపీ, హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి. హిందూ ఏక్తామంచ్ పేరుతో మార్చి 4న ర్యాలీ తీశాయి. ఇద్దరు బీజేపీ రాష్ట్ర మంత్రులు కూడా ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఏడుగురు నిందితులను వెంటనే విడుదల చేయాలని, హిందువులను కాపాడుకోవాలని నినదించారు. తాజాగా ఈ కేసులో బాధితుల తరఫున వాదిస్తున్నదీపికాసింగ్‌ రజావత్‌కు ఈ కేసు నుంచి తప్పుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి. జమ్మూ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భూపిందర్‌ సింగ్‌ సతాథియా తనను బెదిరిస్తున్నట్లు ఆమె తెలిపింది. మరోపక్క.. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది.

ఊరు విడిచి వలస పోతున్న అసిఫా కుటుంబం..

బిడ్డను కోల్పోయిన యూసఫ్ రెండు రోజల కింద ఇంటికి తాళం వేసి కుటుంబం, గొడ్డూగోదాతో సహా కార్గిల్ కొండల్లోకి వలస వెళ్తున్నాడు. ఏటా వేసవిలో మేతకోసం అక్కడికి వెళ్లేవాడు. అయితే అసిఫా హత్య, హిందూ, బీజేపీ నేతల ర్యాలీ, బెదిరింపుల నేపథ్యంలో ముందుగానే వలసదారి పట్టాడు..‘అయ్యా.. ఈ రోజు నా కూతురిపై ఘోరం జరిగింది. రేపు మరొకరి కూతురిపై జరగొచ్చు.. అందుకే రాజకీయాలు చేయకండి. నా చిట్టితల్లిని  హింసించి, పొట్టనబెట్టుకున్నవాళ్లను ఉరితీయండి. న్యాయాన్యాయాలను అల్లాకే వదిలేస్తున్నా..’ అని యూసఫ్ కన్నీటిపర్యంతమవుతూ చెప్పాడు..!