మరొకరి కూతురికీ జరగొచ్చు.. అసిఫా తండ్రి - MicTv.in - Telugu News
mictv telugu

మరొకరి కూతురికీ జరగొచ్చు.. అసిఫా తండ్రి

April 13, 2018

దేశంతోపాటు మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపరచిన కశ్మీర్ బాలిక అసిఫాపై గ్యాంగ్రేప్ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దోషులను కఠినంగా శిక్షించాలని జనం వీధుల్లోకి వస్తున్నారు. మరోపక్క.. అసిఫా కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోతోంది. తమకు ప్రాణభయం ఉందని, అందుకే వెళ్లిపోతున్నామని తండ్రి చెప్పాడు.ఎనిమిదేళ్ల అసిఫాను త్వరలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి తీసికెళ్లేందుకు కొత్తబట్టలు కుట్టించానని అతడు తెలిపాడు. ‘ఆ బట్టలు తయారై వచ్చాయి. కానీ వేసుకోవడానికి నా కూతురే లేకుండా పోయింది. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు.. ఈ రోజు నా కూతురు బలైంది. రేపు మరొకరి కూతురికీ ఈ ఘోరం జరగొచ్చు..’ అని అన్నాడు.

అసిఫా కుటుంబం గొడ్డూగోదా వెంటబెట్టుకుని ఊరు విడిచి కార్గిల్‌కు వలస వెళ్తోంది. దారిలో విలేకర్లు వారితో మాట్లాడారు. ‘మాకు ప్రాణభయం ఉంది. అసిఫాపై అకృత్యానికి పాల్పడిన వారికి మద్దతుగా గత నెల 4న హిందూ ఏక్తా మంచ్ చేసిన ర్యాలీతో భయపడిపోయాం. రేపిస్టులను సమర్థించడం కంటే మరో దారుణం లేదు. మా బతులకు నాశనయ్యాయి. ఈ బాధ ఈ జన్మకు తీరేదికాదు. నాయకుల వాగ్దానాలతో మా కడుపులు నిండవు.. న్యాయం సంగతి అల్లాకు వదిలేస్తున్నాను. మరో చిన్నారికి ఈ ఘోరం జరగొద్దు..’ అని అన్నాడు. అసిఫా తల్లి మాట్లాడుతూ.. ‘కేవలం పశువులు మాత్రమే అలాంటి దారుణం చేస్తాయి. అసిఫా పసిపిల్ల.. ఈ పీడకల మా జీవితాంతం వెంటాడుతుంది.. ’ అని అంది.