ఒక దేవత మొద్దుబారినా.. మరో దేవత కదిలింది..  ఆసిఫా కేసు మృగాడిని పట్టించిన బబరే మాత - MicTv.in - Telugu News
mictv telugu

ఒక దేవత మొద్దుబారినా.. మరో దేవత కదిలింది..  ఆసిఫా కేసు మృగాడిని పట్టించిన బబరే మాత

April 17, 2018

ఎనిమిదేళ్ల కశ్మీర్ బాలిక ఆసిఫాపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది. ఓ హిందూ దేవత గుడిలో సాగిన ఈ పైశాచిక కాండపై జనం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ దేవతకు ఏమైంది? అసలు దేవుడున్నాడా? ఆ మృగాళ్లను అడ్డుకోకుండా ఏం చేశారు ఈ దేవుళ్లంతా? ’ అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో ఒక మృగాడిని మరో హిందూ దేవత పోలీసులకు పట్టించింది!

దేవతగుడి ముందు నీచుడి సెల్ఫీ

ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజీరామ్ కొడుకు విశాల్ జంగోత్రా.. దాదాపు 600 కి.మీ.దూరం ప్రయాణించి మరీ కతువా వెళ్లి అత్యాచారానికి  పాల్పడ్డాడు. ఆసిఫాను హత్య చేశాక తిరిగి యూపీలోని మీరాపూర్ వెళ్లిపోయాడు. మీరట్‌ దగ్గర్లోని మీరాపూర్‌లో ఉన్న ఆకాంక్ష కాలేజీలో బీఎస్సీ మొదటి సంవత్సరం  చదువుతున్న విశాల్ మూడు నెలల కిందట దగ్గర్లోనే ఉన్న ఆ ఊరిలోనే గది అద్దెకు తీసుకున్నాడు.

అతడు గత నెల స్థానిక బబరే మాత గుడివద్ద జరిగిన తిరుణాలలో సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆసిఫా కేసులో అతణ్ని అరెస్ట్ చేయడానికి జమ్మూకశ్మీర్ క్రైమ్ బ్రాంచి పోలీసులు మీరాపూర్ వెళ్లారు. అయితే ఈ కామాంధుడు ఎక్కడున్నాడో వారికి తెలియదు. అతని సెల్ఫీ ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు. రాహుల్ శర్మ అనే జర్నలిస్టు సాయం తీసుకున్నారు. గుడి ప్రాంతంలోని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మరికొంతమంది విద్యార్థుల సాయం తీసుకుని విశాల్ గదికెళ్లి మార్చి 17న అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. మృగాడి అరెస్ట్‌తో మీరాపూర్ ఉలిక్కి పడింది. బబరే మాత గుడివద్ద నివసిస్తున్న ఒక స్థానికుడు దీనిపై స్పందిస్తూ.. ‘బబరే మాత మహిమతో ఆ రాక్షసుడు ఆమె ఆలయం వద్దే దొరికాడు..’ అని అన్నాడు.