అసిఫా.. ఇద్దరు తల్లుల గుండెకోత.. - MicTv.in - Telugu News
mictv telugu

అసిఫా.. ఇద్దరు తల్లుల గుండెకోత..

April 14, 2018

ముద్దొచ్చే రూపంతో, పెద్దపెద్ద కళ్లతో లోకాన్ని చూసి, లోకంలో కనీవినీ ఎరుగని అమానుషానికి బలైపోయిన ఎనిమిదేళ్ల కశ్మీర్ బాలిక అసిఫా విషాదగాథలో మరిన్ని భావోద్వేగభరితాలు బయటికొస్తున్నారు. అసిఫా ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డ. పెంచిన ప్రేమను మరచిపోలేక ఒకతల్లి, రక్తమాంసాలు అందించిన కన్నతల్లి.. ఆ పిల్లను తలచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. అసిఫా నిష్క్రమణ రెండు కుటుంబాల్లో పెనుచీకట్లను నింపింది.

మూడు నెలల వయసులో దత్తత..

అసిఫా బానో 2010లో మహమ్మద్ అఖ్తర్ దంపతులకు జన్మించింది. ఆ పిల్లే చివరి సంతానం. ఈ దంపతులకు అసిఫాతోపాటు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అఖ్తర్ భార్యకు మహమ్మద్ యూసఫ్ పూజ్వాలా అనే సోదరుడు ఉన్నాడు. యూసఫ్, నసీమా బీబీ దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. అయితే పదేళ్ల కిందట మన్సార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ ముగ్గురూ చనిపోయారు. యూసఫ్ దంపతులు కడుపుకోత తట్టుకోలేకపోయారు. వారి దు:ఖాన్ని చూసిన యూసఫ్ సోదరి.. తన కడగొట్టు బిడ్డను దత్తత ఇవ్వాలని నిర్ణయించుకుంది. మూడునెలలు కూడా నిండని అసిఫాను యూసఫ్ దంపతుల చేతుల్లో పెట్టింది. ‘పెంచుకో వదినా.. నాకింకా ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా.. అసిఫాను కావాలంటే పెద్దయ్యాక మాకు తిరిగి అప్పగిద్దువుకానీలే.. మీకు ఆ పిల్ల తోడుగా ఉంటుది..’ అని చెప్పింది.

లేడిలా పరిగెత్తేది..

యూసఫ్, నసీమా దంపతులు అసిఫాను కన్నబిడ్డకంటే ఎక్కువ ప్రేమతో పెంచారు. ఆమె కోసమే బతుకుతున్నామా అన్నట్టు బతుకుతున్నారు. తమ ఒంటరి బతుకుల్లో ఆ పిల్ల కొండంత దీపం వెలిగించిందని మురిసిపోయారు. ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు పిల్లల రూపాలను ఆ చిన్నారిలో చూసుకుంటూ మురిసిపోయేవారు.

‘అసిఫా తెలివైన పిల్ల. లేడిపిల్లలా చెంగుచెంగున పరిగెత్తేది..’ అని నసీమా బీబీ చెప్పింది. ‘అసిఫాకు భయమంటే ఏమిటో తెలియదు. ఎంత చీకట్లో అయినా అడవిలోకి వెళ్లేది.  ఎంత పెద్ద గుర్రాన్నయినా దారిలోకి తెచ్చుకునేది. అయితే చాలా సిగ్గరి, తక్కువగా మాట్లాడేది. ఆ పిల్లను ఆ దుర్మార్గులు చంపేయకుండా వదిలిపెట్టే ఉంటే ఆ ఘోరం గురించి మాకు చెప్పేది.. మత్తుమందు ఇవ్వకుండా ఎలాగోలా తప్పించుకుని వచ్చేది.. ’ అని తాతయ్య చెప్పాడు. పేగుతెంచుకుని పుట్టిన ముగ్గురు పిల్లలను ప్రమాదంలో, ప్రాణానికంటే మిన్నగా పెంచుకున్న అసిఫాను ఇప్పుడు మానవ మృగాల దాడిలో కోల్పోయిన యూసఫ్ దంపతులను ఓదార్చడం ఎవరి వల్లా కావడంలేదు.

దత్తతకు వచ్చానని తెలుసు..

యూసఫ్, నసీమాలు తన అసలు తల్లిదండ్రులు కాదని అసిఫాకు తెలుసు. అయితే లోకం తెలిసినప్పటి నుంచి వారిచెంతే ఉండడంతో వారే తన తల్లిదండ్రులని భావించింది. తనకు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారని కూడా ఆ పిల్లకు తెలుసు. కన్నతల్లి, తండ్రి తమ ఇంటికి వచ్చినప్పుడు వారిని అతుక్కుపోయేది. కానీ కాసేపటి తర్వాత మళ్లీ పెంచిన తల్లినే కరుచుకుపోయేది.

అసలు తల్లికి ఆ ఘోరం తెలియదు..

అసిఫాను రోజులతరబడి అత్యాచారం చేసిన చంపిన సంగతి అసలు తల్లికి ఇంకా తెలియదు. ఆమెను ప్రతీకారం కోసం చంపేశారని మాత్రమే చెప్పారు. కొందరైతే ఏవో జంతువులు చంపాయన్నారు. ‘నేను నా బిడ్డను కోల్పోయాను. నా బావ  కుటుంబం కుప్పకూలింది.. ఈ భయానక విషాదం మా జీవితాంతం వరకు వెంటాడుతుంది..’ అని అఖ్తర్ గాద్గిక స్వరంతో చెప్పాడు.